కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆగ్రహం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, “కేటీఆర్‌కు మైండ్ దెబ్బతింది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి వాస్తవాలను వివరించగా, కేటీఆర్ మాత్రం తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు,” అని మండిపడ్డారు.

కేటీఆర్ మాటలపై తీవ్ర వ్యంగ్యంతో స్పందించిన ఎంపీ, “కాళ్లు, మెడ నొప్పులే కాదు.. కేటీఆర్‌కు వాస్తవాలు వినడానికి సహనం లేదు. ప్రజలకు లెక్కలు తెలియవన్న భావన మీ గర్వాన్ని చూపుతుంది,” అన్నారు. గతంలో ఆర్టీసీ సమ్మె సమయంలో 52 రోజులు ఉద్యమం జరిగినా, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా బయటికి రాలేదని గుర్తు చేశారు. “ఉద్యోగ సంఘాల్లో ఉన్న శ్రీనివాస్ గౌడ్‌ను ఎమ్మెల్యే చేసి, మిగతా సంఘ నేతల గొంతు నొక్కిన చరిత్ర బీఆర్ఎస్‌దే,” అని గుర్తు చేశారు.

అప్పటి బీఆర్‌ఎస్ పాలనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, “మిగులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారు. రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. రుణమాఫీ చేసినందుకు క్షమాపణ చెప్పాలా? ప్రజలకు అవసరమైన సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు,” అన్నారు.

కేటీఆర్‌పై వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేస్తూ, “మీ హయాంలో జీతాలు నెల మొదట చెల్లించారా? మిస్ వరల్డ్ కోసం 250 కోట్లు ఖర్చు చేశారంటావు.. కానీ వాస్తవం రూ.27 కోట్లు మాత్రమే. తప్పుడు లెక్కలు చెప్పడం బాధ్యతలేని ప్రవర్తన. మీరు దోచుకున్నంతగా దేశంలో ఎవరూ దోచుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడిన అధికారి జైలుకు వెళ్ళాడు. సీఎం కుర్చీలో కేటీఆర్ కూర్చోవడం పగటి కలగానే మిగిలిపోతుంది,” అంటూ విమర్శలు గుప్పించారు.

అలాగే, “మూడు ఎకరాలు ఎందుకు ఇవ్వలేదు? ప్రజల కోసం సీఎం రుణమాఫీ చేశాడు. పిట్టకథలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించకండి. బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది,” అని ఎంపీ చామల కిరణ్ స్పష్టం చేశారు.

Read More : కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో భారీ అవినీతికి పాల్పడింది

One thought on “కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆగ్రహం

Comments are closed.