హిందువులను భారత్‌కు పంపించాలంటూ డిమాండ్

కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదుల దుశ్చర్యలు మరింత తీవ్రంగా మారాయి. తాజాగా, టొరంటోలోని మాల్టన్ గురుద్వారాలో ఖలిస్థానీ మద్దతుదారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కెనడాలో నివసిస్తున్న సుమారు 8 లక్షల మంది హిందువులను బలవంతంగా భారతదేశానికి పంపించాలని డిమాండ్ చేయడం తీవ్ర కలకలం రేపింది.

ఈ ప్రదర్శనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ల బొమ్మలను ఒక బోనులో పెట్టి అభ్యంతరకరంగా ప్రదర్శించడంతో వివాదం ఉవ్వెత్తున లేచింది. ఇదే తరహాలో ఇటీవల ఖలిస్థానీ మద్దతుదారులు కెనడాలోని ఒక గురుద్వారా, ఒక హిందూ దేవాలయంపై దాడులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను హిందూ సమాజానికి చెందిన నేత షవన్ బిండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “ఇది కేవలం భారత ప్రభుత్వంపై వ్యతిరేకత కాదు. ఇది ఖలిస్థానీ గ్రూపుల హిందువులపై ఉన్న ద్వేషానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు. అంతేకాక, కనిష్క విమాన బాంబు దాడికి కారకులుగా ఈ గ్రూపులు ఉన్నాయని గుర్తు చేశారు.

ఇక కెనడాకు చెందిన మరో జర్నలిస్ట్ డానియల్ బోర్డమన్ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఖలిస్థానీలను తీవ్రంగా విమర్శించారు.

ఇటీవలి కాలంలో ఖలిస్థానీ వేర్పాటువాదులు భారత మంత్రులను బెదిరిస్తున్న దృష్యాలు మరింత గంభీరంగా మారాయి. ఇటీవల కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూను హత్య చేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే ‘వారిస్ పంజాబ్ దే’ వంటి సంస్థలు హోంమంత్రి అమిత్ షాపై కూడా కక్ష పెంచినట్లు సమాచారం.

ఇలాంటి దుశ్చర్యలు కెనడాలో ఉన్న భారతీయుల్ని తీవ్రంగా కలచివేస్తున్నాయి. ఖలిస్థానీ మద్దతుదారుల ఈ రకమైన ఉగ్రవాద చర్యలపై చర్యలు తీసుకోవాలని భారతీయ వర్గాలు కోరుతున్నాయి.

Read More : భారత వైమానిక దళం పూర్తిస్థాయిలో సిద్ధం