120 దేశాల అందగత్తెల రాక

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. మే 7న ప్రారంభమై జూన్ 2న ముగియనున్న ఈ ప్రపంచ సుందరాంగనల పోటీలో 120 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో నగరం మిస్సుల సందడి కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబు అయింది.

విదేశీ అతిథులను స్వాగతించేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టును ప్రత్యేకంగా అలంకరించారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక లాంజ్‌లు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. తెలంగాణ సంప్రదాయ శైలిలో అతిథులకు స్వాగతం పలికేందుకు ‘తెలంగాణ జరూర్ ఆనా’ నినాదంతో స్వాగత తోరణాలు సిద్ధమయ్యాయి.

అందాల భామల రాకతో సందడి

ఆదివారం మిస్ బ్రెజిల్ జెస్సీకా స్కాండుజ్ పెద్రోసో, మిస్ సౌత్‌ఆఫ్రికా జోయాలిజే జాన్సన్ వాన్ రెన్స్‌బర్గ్ సహా దాదాపు 90 మంది పోటీదారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. సోమవారం నుండి మరిన్ని దేశాల మోడల్స్ రానున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వారు దిగిన వెంటనే సంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారిని ఆయా హోటళ్లకు తరలించారు.

పాకిస్థాన్ అందగత్తెలకు బ్యాన్

ఈ పోటీల్లో పాకిస్థాన్‌కు చెందిన అందాల భామలు పాల్గొనరని సమాచారం. భారత్–పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉన్న పాకిస్థానీలకు ఏప్రిల్ 29ని తుది గడువుగా నిర్ణయించడంతో వారు ఇప్పటికే దేశం విడిచినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మిస్ వరల్డ్ వేదికపై పాకిస్థాన్ నుంచి ఎవరూ పాల్గొనడంలేదు.

ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలు వైభవంగా జరుగుతుండగా, హైదరాబాద్ సౌందర్యం ప్రపంచం ముందుకు వెళ్లే వేదికగా నిలవనుంది.

Read More : తెలంగాణలో భారీ వర్షాల అప్‌డేట్..