బంగ్లాదేశ్‌లో హిందూ నేతను కిడ్నాప్ చేసి దారుణ హత్య — తీవ్ర ఉద్రిక్తత!

హిందువులు, మైనార్టీలపై దాడులతో బంగ్లాదేశ్ తీవ్రంగా అల్లకల్లోలం అవుతోంది. రోజుకో ఘటన చోటుచేసుకుంటూ అక్కడి పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. తాజాగా బంగ్లాదేశ్‌లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఒక హిందూ నేతను ముష్కరులు కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టి హత్య చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం నెలకొంది.

బాబేశ్ చంద్ర అనే వ్యక్తి బంగ్లాదేశ్ హిందూ సమాజంలో ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన బంగ్లాదేశ్ పూజా ఉద్జపన్ పరిషత్‌కు చెందిన బిరాల్ యూనిట్ ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. దినాజ్‌పూర్‌లో నివాసముండే చంద్రను గురువారం ముష్కరులు కిడ్నాప్ చేశారు.

ఈ సంఘటనపై చంద్ర భార్య శాంతన స్పందిస్తూ… ‘‘గురువారంనాడు రెండు బైకులపై నలుగురు వ్యక్తులు మా ఇంటికి వచ్చి నా భర్తను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు’’ అని తెలిపారు. అనంతరం చంద్రను నారాబరి గ్రామానికి తీసుకెళ్లారని పలువురు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అక్కడే ఆయనను అత్యంత కిరాతకంగా కొట్టినట్టు వెల్లడించారు.

దుండగులు శుక్రవారం ఉదయం చలనం లేని చంద్ర శరీరాన్ని ఆయన ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు… కేసు నమోదు చేశామని, ఘటనకు సంబంధించిన నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

2 thoughts on “బంగ్లాదేశ్‌లో హిందూ నేతను కిడ్నాప్ చేసి దారుణ హత్య — తీవ్ర ఉద్రిక్తత!

Comments are closed.