ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనాల వ్యవహారం రాష్ట్ర రాజకీయం లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని 8,427 మంది క్రైస్తవ పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనాన్ని అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికే ఉత్తర్వులు విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు కుఱుపించారు . గుడ్ ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు గౌరవ వేతనం ప్రకటించడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇంతకాలం గౌరవ వేతనం ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికల ముందు ఈ ప్రకటన ఎందుకు చేశారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
పాస్టర్ ప్రవీణ్ హత్య అంశాన్ని ప్రస్తావిస్తూ, ఈ కేసులో కోట్లాది మంది క్రిస్టియన్లు, హిందువులు, ముస్లింలు స్పందిస్తున్న సమయంలో, పాస్టర్లకు గౌరవ వేతనం ప్రకటించడం ద్వారా వారి నోరు మూయించాలనే ప్రయత్నమా అని అనుమానం వ్యక్తం చేశారు.
గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు హిందువులను క్రైస్తవులుగా మారుస్తున్నారని వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేసిన పాల్, ఇప్పుడు పాస్టర్లకు గౌరవ వేతనం ప్రకటించడం వెనుక రాజకీయ స్వార్థం దాగి ఉందని ఆరోపించారు.
8 వేల మందికి మాత్రమే వేతనం ప్రకటిస్తే మిగిలిన 80 వేల మంది పాస్టర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ముస్లిం మౌలానాలు, హిందూ అర్చకులకు గౌరవ వేతనం ఎందుకు ప్రకటించరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దైవ సేవకులంతా మోసపోకూడదని, ప్రజలందరూ ఓటుకు అమ్ముడు పోకూడదని, నిజాయితీకి నిలబడి పోరాడాలని పాల్ పిలుపునిచ్చారు. అదేసమయంలో లక్ష రూపాయలు కూడా లేని వ్యక్తి ఎలా లక్షల కోట్ల ఆస్తులకు అధిపతిగా మారారని ప్రశ్నిస్తూ, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

One thought on “చంద్రబాబును ప్రశ్నించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు”
Comments are closed.