పాటలు ఆలస్యం చేసినా.. న్యాయం చేశా: రధన్ కౌంటర్

Radhan reacts to Sandeep Reddy Vanga criticism

యాంకర్‌గా పేరు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు, ఇప్పుడు హీరోగా కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన రెండో సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ రధన్ హైదరాబాద్‌కి వచ్చి మీడియాతో మాట్లాడారు. సాధారణంగా చెన్నైలో ఉంటూ అక్కడే మ్యూజిక్ కంపోజిషన్ చేయడం అలవాటైన రధన్‌పై తెలుగు ఇండస్ట్రీలో కొంతకాలంగా కొన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అర్జున్ రెడ్డి సినిమా సమయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, రధన్‌పై టైమ్ మేనేజ్‌మెంట్ లోపాలు ఉన్నాయంటూ విమర్శలు చేశారు. అలాగే నటుడు సిద్ధార్థ్ నిర్మాతగా ఉన్న సినిమాలో కూడా రధన్ ఆలస్యం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదులో తాట తీస్తామని కొందరు మాటలు కూడా చెప్పినట్టు వార్తలొచ్చాయి. ఈ విషయంపై రధన్ స్పందిస్తూ – “సందీప్ రెడ్డి గారు నాకు తండ్రి లాంటి వారు. నాన్న తిడితే బయటకి వెళ్లి విమర్శలు చేయమంటారా? తిట్లు నా మీద ప్రేమగా తీసుకుంటాను,” అని పాజిటివ్‌గా వ్యాఖ్యానించారు.

అర్జున్ రెడ్డితో తన కెరీర్‌కు శుభారంభం దక్కిందని, అప్పటినుంచి సంగీతానికే ప్రాధాన్యతనిస్తున్నానని రధన్ చెప్పారు. “ప్రతి డైరెక్టర్ వ్యక్తిత్వం వేరేలా ఉంటుంది. ఎవరైనా ఒకేలా ఉండాలనే నియమం లేదు. సంగీతం మీద నాకు ప్రేమ ఉంది. పాటలు ప్రేక్షకుల హృదయాలను తాకితే అదే నాకు విజయము” అని ఆయన అన్నారు. అనుదీప్‌తో కలిసి ‘జాతి రత్నాలు’కు మంచి సంగీతం అందించానని కూడా గుర్తు చేశారు.

Read More

One thought on “పాటలు ఆలస్యం చేసినా.. న్యాయం చేశా: రధన్ కౌంటర్

Comments are closed.