హైదరాబాద్ నగరంలో యువతలో కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయన్న ఆందోళనకర విషయం వెలుగు చూసింది. నిమ్స్ (NIMS) ఆసుపత్రి వైద్యుల వివరాల ప్రకారం, ఇటీవల రోజుకు కనీసం 500 మంది యువతీయువకులు కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోవడం వైద్య రంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
నిమ్స్ వైద్యుల సమాచారం ప్రకారం, ఆసుపత్రికి వచ్చే బాధితుల్లో ఎక్కువమంది యువ ఉద్యోగులు, అలాగే జిమ్‌కు వెళ్లే వారు ఉన్నారని పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పటికీ, శరీర అవసరాలకు అనుగుణంగా సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, అదుపుతప్పిన వ్యాయామం, అనవసరంగా అధిక ప్రొటీన్ సప్లిమెంట్లను తీసుకోవడం వంటి అనేక అంశాలు యువతలో కిడ్నీ సమస్యలకు దారితీస్తున్నాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణాల్లో ద్రవాలు తక్కువగా తీసుకోవడం, ఒత్తిడిని జయించడానికి కొన్ని హానికరమైన అలవాట్లను అలవర్చుకోవడం కూడా ఒక ప్రధాన కారణమని వైద్యులు తెలిపారు. ఉద్యోగ భాద్యతలు, నిత్యం ఒత్తిడిలో ఉండే జీవనశైలి కారణంగా యువత ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం ఆందోళనకర విషయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వైద్యుల సూచనల ప్రకారం, రోజువారీ ఆహారంలో పోషకాహారాన్ని సమపాళ్లలో తీసుకోవడం, రోజుకు కనీసం 3-4 లీటర్ల నీటిని త్రాగడం, మితమైన వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వడం, ప్రొటీన్ సప్లిమెంట్లు వంటి వాటిని వైద్యుల సూచన మేరకు మాత్రమే వినియోగించడం ద్వారా కిడ్నీ సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో యువత తమ జీవనశైలిలో మార్పులు తీసుకురావాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అప్రమత్తంగా ఉండాలని నిమ్స్ వైద్యులు కోరుతున్నారు.

2 thoughts on “హైదరాబాద్ యువతలో కిడ్నీ సమస్యలు పెరుగుతుండటం ఆందోళనకరం – నిమ్స్ వైద్యులు”
Comments are closed.