తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. బుధవారం జరిగిన బీఏసీ (BAC) సమావేశంలో అసెంబ్లీ పనిదినాలపై నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పదకొండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఈనెల 19న ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అంతకుముందు, 14న హోలీ పండుగ నేపథ్యంలో సెలవు ప్రకటించారు. 15న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి, దానిపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. 16న ఆదివారం కావడంతో ఆ రోజు సమావేశాలు ఉండవు. 17న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై చర్చించనున్నారు.
18న బీసీ కులగణన, రిజర్వేషన్లపై చర్చ జరగనుంది. 19న బడ్జెట్‌ను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 21న బడ్జెట్‌పై చర్చించనున్నారు. అలాగే మూడు రోజుల పాటు పద్దులపై చర్చ కొనసాగనుంది. 27న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలుపుతారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ నేతలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ సమావేశానికి హాజరయ్యారు.
బీఆర్ఎస్ నేతలు కనీసం 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, బీఏసీ సమావేశంలో మాత్రం 11 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారని తెలిసింది.
