“9 ఏళ్ల ఆరిత్‌ కపిల్‌ జీఎంకు షాక్: అరుదైన విజయంతో ఘనత”

ఆరిత్‌ కపిల్ : జీఎంకు 9 ఏళ్ల బాలుడి షాక్‌

అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ రాసెట్‌ జియాటినోవ్‌కు భారతీయ చెస్‌ బుడతడు ఆరిత్‌ కపిల్‌ షాకిచ్చాడు. సోమవారం జరిగిన కేఐఐటీ ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌ ఆఖరిదైన తొమ్మిదో రౌండ్లో 66 ఏళ్ల రాసెట్‌పై తొమ్మిదేళ్ల ఆరిత్‌ 63వ ఎత్తులో విజయం సాధించాడు. తెల్లపావులతో బరిలోకి దిగిన ఆరిత్‌ ప్రారంభంలో తడబడినా, ఆట కొనసాగేకొద్దీ పట్టు బిగించి గెలుపొందాడు.

ప్రపంచంలో అత్యంత పిన్న వయస్సులో (9 సంవత్సరాల 2 నెలలు) జీఎంను ఓడించిన భారత చెస్‌ క్రీడాకారుడిగా ఆరిత్‌ అరుదైన ఘనత సాధించాడు. భారత మూలాలు గల సింగపూర్‌ క్రీడాకారుడు అశ్వథ్‌ కౌశిక్‌ (8 సంవత్సరాల 6 నెలలు) ఈ జాబితాలో ప్రథమ స్థానంలో ఉండగా, ఆరిత్‌ మూడో స్థానంలో నిలిచాడు.

ఇక, రష్యా జీఎం బోరిస్‌ సావచెంకో టైటిల్‌ సాధించాడు.