చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో నివాసం ఉంటున్న 47 ఏళ్ల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వింత సమస్యను ఎదుర్కొంటున్నారు. గత మూడు దశాబ్దాలుగా అతనికి పాము కాట్లు సాధారణ విషయంగా మారాయి. ఇదివరకు 103 సార్లు పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన సుబ్రహ్మణ్యం ప్రాణాలతో బయటపడ్డ మృత్యుంజయుడిగా మారారు.
సుబ్రహ్మణ్యం కుమ్మరికుంట గ్రామానికి చెందిన కూలీగా జీవనం సాగిస్తున్నారు. 18 ఏళ్ల వయసులో తొలిసారి పాము కాటుకు గురైన ఆయన.. అప్పటి నుంచి ఇప్పటివరకు 103 సార్లు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. పాములు పగబట్టి కరిస్తున్నాయా లేక ప్రమాదవశాత్తుగా అవుతున్నాయా అన్నదే ప్రశ్నార్ధకంగా మారింది.
సుబ్రహ్మణ్యం ఎక్కడ ఉన్నా అక్కడికి పాములు వెతుక్కుంటూ వచ్చి కాటేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నాగుపాము సహా వివిధ రకాల విష సర్పాల కాటుకు గురైనప్పటికీ ప్రతి సారి చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడటం ఆశ్చర్యకరంగా మారింది.
తాజాగా మూడు రోజుల క్రితం కోళ్ల ఫారంలో పని చేస్తుండగా పాము కాటుకు గురికావడంతో సుబ్రహ్మణ్యం 103వ సారి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం పెద్దపంజాణి మండలం శివాడి గ్రామ సమీపంలోని జెఎంజె మిషనరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్రహ్మణ్యంకు ఆసుపత్రి సిబ్బంది సానుభూతితో చికిత్స అందిస్తున్నారు.
సుబ్రహ్మణ్యం తరచూ ఆసుపత్రి పాలవుతుండటంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, వైద్యం ఖర్చులతో ఆర్థికంగా దెబ్బతిన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలా సుబ్రహ్మణ్యంను పాములు ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాయన్నది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది.
