హైదరాబాద్: పాస్పోర్టు అపాయింట్‌మెంట్‌లో హైదరాబాద్ ఆర్పీవో గొప్ప మైలురాయి చేరింది

హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం (ఆర్పీవో) పాస్పోర్టు అపాయింట్‌మెంట్ ప్రక్రియలో గొప్ప మైలురాయిని చేరినట్టు స్థానిక పాస్పోర్టు అధికారిణి స్నేహజ తెలిపారు. 2023లో అపాయింట్‌మెంట్ కోసం 22 రోజులు పడుతుంటే, 2024లో పోలీసు మరియు తపాలా శాఖల సహకారంతో ఈ సమయాన్ని 6-8 రోజుల వరకు తగ్గించామని ఆమె వెల్లడించారు.

శుక్రవారం హైదరాబాద్ ఆర్పీవోలో విలేకరులతో మాట్లాడుతూ, స్నేహజా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి: “ఆర్పీవో హైదరాబాద్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 5 పాస్పోర్టు సేవాకేంద్రాలు (పీఎస్కే), 14 పోస్ట్ ఆఫీస్ పాస్పోర్టు సేవాకేంద్రాలు (పీవోపీఎస్కే) పనిచేస్తున్నాయి. 2024లో ప్రతి రోజూ సగటున 4,200 దరఖాస్తులను పరిశీలించాం. పాస్పోర్టుల జారీ మరియు పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ సేవలతో కలిపి మొత్తం 9.02 లక్షల దరఖాస్తులను పరిష్కరించాం. నిజామాబాద్‌లో సాధారణ అపాయింట్‌మెంట్లను మరుసటి పనిదినం నుంచే అందుబాటులోకి తీసుకురాగా, పీవోపీఎస్కేలో వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకున్నాం. వరంగల్‌లో అత్యధికంగా రోజుకు 130 దరఖాస్తులు వస్తున్నాయి, మిగతా కేంద్రాలలో 90 చొప్పున దరఖాస్తులు వస్తున్నాయి.”

తత్కాల్ పాస్పోర్టులు 1-3 పనిదినాల్లోనే జారీ అవుతున్నాయని, సాధారణ పాస్పోర్టులు 5-7 పనిదినాల్లో (పోలీసు ధ్రువీకరణ సమయాన్ని మినహాయించి) జారీ అవుతున్నాయని ఆమె వివరించారు. సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో ప్రతి గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందులో గత సంవత్సరం 30,000 మందికి పైగా నేరుగా సమస్యలు పరిష్కరించారని తెలిపారు. మెయిల్స్ ద్వారా 10,000 మందికి పైగా ఫిర్యాదులు పరిష్కరించామని కూడా ఆమె పేర్కొన్నారు.

సంచార పాస్పోర్టు సేవల కోసం ప్రత్యేక వ్యాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు, 2025లో మరింత మెరుగైన సేవలు అందించడమై లక్ష్యంగా పెట్టుకున్నామని స్నేహజ చెప్పారు.

హైదరాబాద్ ఆర్పీవోలో అటెస్టేషన్, అపోస్టిల్ సౌకర్యం

స్నేహజా విదేశాలకు వెళ్లే వారి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో ద్రవపత్రాల ధ్రువీకరణ ముఖ్యం అని తెలిపారు. దీనికి సంబంధించిన అటెస్టేషన్, అపోస్టిల్ సేవలు ఇప్పుడు హైదరాబాద్ ఆర్పీవోలో కూడా అందుబాటులో ఉన్నాయి. “మునుపటి పరిస్థితిలో దరఖాస్తుదారులు ఈ సౌకర్యం కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఈ సేవలు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి,” అని ఆమె చెప్పారు.

ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ, “దరఖాస్తుదారులు ముందుగా రాష్ట్ర సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి పత్రాలు సమర్పించాలి. వారు అన్ని పత్రాలను పరిశీలించి, వాటిని ఒక ఏజెన్సీకి అప్పగిస్తారు. ఆ తర్వాత ఆర్పీవోకి వచ్చే పత్రాలపై అటెస్టేషన్ మరియు అపోస్టిల్ చేసి, స్టాంపు మరియు సంతకం చేసిన తర్వాత దరఖాస్తుదారులకు అందజేస్తాము,” అని వివరించారు.