ఫార్ములా ఈ కార్ కేసు: ఏసీబీ విచారణకు కేటీఆర్.. తీవ్ర ఉత్కంఠ
హైదరాబాద్, జనవరి 9:
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో (Formula E Car Race Case) బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) గురువారం ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నిధుల మళ్లింపు, నిబంధనల ఉల్లంఘనలపై ఏసీబీ కేటీఆర్‌ను ప్రశ్నించనుంది.
కేటీఆర్ విచారణ
ఏసీబీ ముగ్గురు అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నిస్తుండగా, ఇన్వెస్టిగేషన్ రూమ్‌లో కేటీఆర్‌ను న్యాయవాదికి దగ్గరగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. న్యాయవాది రామచంద్రరావు లైబ్రరీలో ఉండి దూరంగా ఈ విచారణను పర్యవేక్షించనున్నారు. రూ. 55 కోట్ల నిధుల బదిలీ, నిబంధనల ఉల్లంఘనలపై విచారణ జరుగుతుందని సమాచారం.
మరల నోటీసులు
ఈనెల 6న కేటీఆర్‌ను విచారణకు పిలిచిన ఏసీబీ, న్యాయవాదితో విచారణకు హాజరవ్వడానికి అనుమతి నిరాకరించడంతో కేటీఆర్ కార్యాలయం బయట నిరీక్షించారు. అనంతరం లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చి వెనుదిరిగిన కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. న్యాయవాదితో విచారణకు అనుమతించాలని హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌కు హైకోర్టు మద్దతు తెలిపింది.
అరెస్ట్‌పై ఉత్కంఠ
పురపాలకశాఖ ప్రత్యేక అధికారి అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్ ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నించనున్న ఏసీబీ, కేసు పురోగతిని బట్టి కేటీఆర్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు ప్రచారం అవుతున్నాయి.
ఈడీ దూకుడు
ఫార్ములా ఈ కార్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను వేగవంతం చేసింది. హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎన్‌ఎల్ రెడ్డిని విచారించిన ఈడీ, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేసింది.
ఈ కేసులో కేటీఆర్‌పై ఏసీబీ తీసుకోబోయే చర్యలు రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
