ఇంటర్నెట్రెస్క్: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బుధవారం ఉదయం 7:27 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీనికి 5.0 తీవ్రత నమోదైంది. హైదరాబాద్లోని సీఎస్ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు ఈ వివరాలను వెల్లడించారు.
భూకంప కేంద్రం నుంచి 225 కి.మీ పరిధిలో ప్రకంపనలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు వంటి పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదు కాగా, తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్మెట్ సహా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. ములుగు, హనుమకొండ, భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని వంటి గోదావరి పరివాహక ప్రాంతాలు కూడా ఈ ప్రకంపనల ప్రభావాన్ని అనుభవించాయి.
భూకంప వివరాలు (CSIR-NGRI):
తేదీ: 04 డిసెంబర్ 2024
సమయం: 01:57:01 (UTC)
స్థానం: 18.314N, 80.207E
తీవ్రత: 5.0 ML
భూకంప కేంద్రం: మేడారం, ములుగు జిల్లా, తెలంగాణ
ప్రభావిత ప్రాంతాలు:
- ఏలూరు జిల్లా: కొయ్యలగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టయగూడెం, బొర్రాంపాలెం
- పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్
- ఎన్టీఆర్ జిల్లా: నందిగామ, గంపలగూడెం, తిరువూరు
- వరంగల్ జిల్లా: నర్సంపేట
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాటారం, చెన్నారావుపేట
50 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే తీవ్రత:
1969లో భద్రాచలం పరిసరాల్లో ఇదే తీవ్రతతో భూకంపం సంభవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి తీవ్రత గల భూకంపం సంభవించడం గమనార్హం. ఈ ప్రాంతాలు జోన్-3లో ఉండటంతో, ఉత్తర భారత జోన్-5 ప్రాంతాలకంటే తక్కువ తీవ్రత ఉంటుంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
ఆ ఘటనకు భూకంపానికి సంబంధముందా?
మేడారం ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తించడంతో, గతంలో జరిగిన ఓ ఘటనపై స్థానికులు చర్చిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో మేడారం ప్రాంతంలో భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా 50,000 చెట్లు నేలకూలాయి. ఈ ప్రాంతం ఇప్పుడు భూకంప కేంద్రంగా గుర్తించడం పట్ల శాస్త్రవేత్తలు స్పందించాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
