దిల్లీ: గర్భస్రావం కారణంగా ఎదురైన శారీరక, మానసిక కష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా, పనితీరు సరిగా లేదని చెప్పి మధ్యప్రదేశ్ హైకోర్టు మహిళా జడ్జీని తొలగించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ‘పురుషులకు కూడా రుతుక్రమం ఉండాల్సింది. సంతానాన్ని కలిగించడంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను వారు అర్థం చేసుకోవాలి’ అని జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం పేర్కొన్నది.
మధ్యప్రదేశ్ హైకోర్టు తీసుకున్న సివిల్ జడ్జీల తొలగింపు విధానంపై వివరణ ఇవ్వాలని బుధవారం హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘ఆ మహిళా జడ్జీకి గర్భస్రావం జరిగింది. అటువంటి మహిళ శారీరకంగా, మానసికంగా చాలా కష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది’ అని జస్టిస్ బి.వి. నాగరత్న పేర్కొన్నారు. పెండింగ్ కేసుల ఆధారంగా, ఆమెను ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా తొలగించడం తప్పునని విమర్శించారు.
మధ్యప్రదేశ్లో ఆరుగురు మహిళా జడ్జీల పనితీరు సరిపోలేదంటూ తొలగింపునకు సంబంధించిన వివాదాన్ని సుప్రీంకోర్టు 2023 నవంబర్ 11న సుమోటోగా విచారించేందుకు స్వీకరించింది. ఈ వివాదంలో హైకోర్టుతో పాటు తొలగింపునకు గురైన మహిళా జడ్జీలకూ నోటీసులు ఇవ్వగా, ఆ సమయంలో నలుగురు మహిళా జడ్జీలను తిరిగి నియమిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు విస్తృత ధర్మాసనం ఆగస్టు 1న నిర్ణయం తీసుకుంది.
మరిన్ని వివరణలు ఇవ్వకుండా, అదితి కుమార్ శర్మ పనితీరు అత్యంత దురదృష్టకరమని, 2022లో ఆమె వద్ద 1,500 కేసులు పెండింగ్లో ఉన్నాయని సుప్రీంకోర్టుకు హైకోర్టు నివేదించింది.
2021లో గర్భస్రావం మరియు తన సోదరుడికి క్యాన్సర్ సోకడంతో ఆమె కష్టాలను ముందే హైకోర్టుకు తెలిపింది. ఈ విషయాలు సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి. అలాగే, కరోనా వ్యాప్తి సమయంలో న్యాయస్థానాలు పనిచేయని విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది.
అదితి కుమార్ శర్మ తన పనితీరు మదింపు సమయంలో మాతృత్వ సెలవులో ఉన్న విషయాన్ని హైకోర్టు దృష్టిలో పెట్టుకోలేదని, తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని పేర్కొన్నారు. సమానత్వ హక్కును ఉల్లంఘించినందుకు హైకోర్టును ఆమె తప్పు పట్టారు.
