ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియామకం

ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కొత్త గవర్నర్‌గా ప్రస్తుత రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ కేబినెట్ (ఏసీసీ) సోమవారం ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. 56 ఏళ్ల మల్హోత్రా బుధవారం ఆర్‌బీఐ 26వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన మూడు సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగనున్నారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మల్హోత్రా, ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఈ నెల 10తో దాస్ పదవీకాలం ముగియనుంది.

కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, ఫైనాన్స్, ట్యాక్సేషన్‌లో అనుభవం

ఐఐటీ కాన్పూర్ నుంచి కంప్యూటర్స్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన మల్హోత్రా, అనంతరం అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పుచ్చుకున్నారు. ఐఏఎస్ అధికారిగా 33 ఏళ్ల ప్రస్థానంలో ఆయన పవర్, ఫైనాన్స్, ట్యాక్సేషన్, ఐటీ, మైన్స్ వంటి పలు శాఖల్లో పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతక్రితం ఆర్థిక సేవల విభాగ కార్యదర్శిగానూ పనిచేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ఫైనాన్స్, ట్యాక్సేషన్ విభాగాల్లో ఆయనకు విశాలమైన అనుభవం ఉంది. కొత్త అదాయం పన్ను విధానం అమలులో ఆయన కీలకపాత్ర పోషించారు.