ఆడ దోమలను అంతం చేయడానికి ఆస్ట్రేలియాలో ‘టాక్సిక్ మేల్ టెక్నిక్’ ప్రయోగం

దోమల అంతానికి కొత్త టెక్నిక్‌: విషపూరిత మగ దోమల ప్రయోగం

సిడ్నీ, జనవరి 8: రాజును చంపేందుకు విషకన్యలను ఉపయోగించిన కథలు సినిమాల్లో చాలానే చూశాం. ఇప్పుడు అదే తరహా టెక్నిక్‌ను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు దోమల నియంత్రణ కోసం ప్రయోగిస్తున్నారు. ‘టాక్సిక్ మేల్ టెక్నిక్’ పేరుతో చేపడుతున్న ఈ పరిశోధనలో, మగ దోమల వీర్యాన్ని విషపూరితం చేసే జన్యుమార్పిడి చేస్తున్నారు.

ఈ విషపూరిత మగ దోమలు ఆడ దోమలతో కలిసినప్పుడు, వీర్యంలో ఉన్న విషప్రోటీన్లు ఆడ దోమల ఆరోగ్యాన్ని దెబ్బతీసి, చివరకు వాటిని చంపేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దోమ కాట్ల కారణంగా 39 కోట్ల మందికి డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి జ్వరాలు వస్తున్నాయి. ఈ వ్యాధుల వ్యాప్తికి ప్రధాన కారణం ఆడ దోమలే కావడంతో, వాటిని అరికట్టడంలో ఈ టెక్నిక్‌ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆడ దోమల జీవన కాలం తగ్గింపు:
జన్యుమార్పిడి చేసిన మగ దోమలతో కలిసిన ఆడ దోమల జీవితకాలం 60 శాతం తగ్గినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆడ దోమల సంఖ్య తగ్గిపోతే, దోమ కాట్ల ద్వారా వ్యాపించే వ్యాధుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఈ టెక్నిక్‌ ప్రయోగాత్మక దశలో ఉండగా, దోమల నియంత్రణకు ఇది నూతన మార్గాన్ని చూపుతుందనే నమ్మకంతో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ముందుకుసాగుతున్నారు.