అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అతనికి రూ.50 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలనీ ఆదేశించింది. అలాగే, సాక్షులను ప్రభావితం చేయకూడదని, కేసు ప్రక్రియపై ప్రభావం చూపేలా వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం చేసింది. ఈ కేసులో అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా రెండు నెలల పాటు హాజరయ్యేలా షరతు విధించింది.

విచారణలో, అల్లు అర్జున్‌పై బీఎన్ఎస్ యాక్ట్ 105 వర్తించదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనా స్థలానికి అల్లు అర్జున్ 30 మీటర్ల దూరంలో ఉన్నారని, ఆయన రాకపోతే ఈ ఘటన జరగదని వాదించారు. అయితే, పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు అల్లు అర్జున్ పలుకుబడి ఉన్న వ్యక్తి అని, ఆయనకు బెయిల్ మంజూరు చేయడం విచారణపై ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు.

డిసెంబరు 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ సహా 18 మందిపై కేసు నమోదు చేశారు. ముందుగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా, తాజాగా నాంపల్లి కోర్టు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.