అమృత్‌సర్‌లో పంజాబ్ రాష్ట్రంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రసిద్ధ స్వర్ణ దేవాలయంలో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. సుఖ్బీర్ బాదల్ ప్రస్తుతం శిక్ష అనుభవిస్తూ స్వర్ణ దేవాలయ ప్రవేశద్వారం వద్ద సేవాదారుగా పనిచేస్తున్నారు.
ఈ ఘటనలో, సుఖ్బీర్ చక్రాల కుర్చీపై కూర్చుని సేవాదార్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, ఓ వృద్ధుడు అతనిని చేరుకున్నాడు. కొన్ని అడుగుల దూరంలో నిలుచున్న వృద్ధుడు తన ప్యాంట్ జేబులో నుంచి తుపాకీ తీసి సుఖ్‌బీర్‌పై కాల్పులు జరిపాడు. ఈ సంఘటనను గమనించిన అతని భద్రతా సిబ్బంది వెంటనే ఆ వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు, దీంతో ప్రమాదం తప్పింది.
సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు ఎటువంటి హానీ జరగలేదు. భద్రతా సిబ్బంది నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని నారైన్ సింగ్ చౌరాగా గుర్తించారు. అతడు గతంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్రవాద సంస్థలో పనిచేసినట్లు కొన్ని ఆంగ్ల మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సుఖ్బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పిదాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. 2007-2017 మధ్యకాలంలో పార్టీ తీసుకున్న రాజకీయ నిర్ణయాలను అకాల్ తఖ్త్ తప్పుబట్టింది. ఈ సందర్భంలో, సుఖ్బీర్ను దోషిగా తేల్చి, స్వర్ణ దేవాలయంలో సేవాదారుగా పనిచేయాలని ఆదేశించింది.
ఇక తన చేసిన తప్పులను అంగీకరిస్తూ, మెడలో “తప్పు చేశాను” అనే బోర్డు ధరించి, చేతిలో ఈటె పట్టుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటుచేయాలని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని సూచించారు.
