మీ దీపాన్ని ఆరనివ్వరు
‘అనాయాసేన మరణం.. వినా దైన్యేన జీవితం..’ అని భగవంతుడిని కోరుకుంటారు చాలామంది. రోగాల పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ దుర్భరమైన మరణం రావొద్దని ప్రార్థిస్తారు. ఆరోగ్య సూత్రాలను ఎంత పాటించినా, జీవిత చివరిదశలో శరీరానికి ఏవో రుగ్మతలు రావడం సహజం. కొందరు అదృష్టవంతులు రాత్రికి రాత్రి నిద్రలో కన్నుమూస్తారు! కానీ వృద్ధాప్యంలో ఎవరికీ భారంగా కాకుండా, ఎవరినీ “దేహీ” అనకుండా జీవితం సాగించాలంటే అది మీ చేతుల్లోనే ఉంది.
రిటైర్మెంట్ ప్లాన్‌కి ప్రాధాన్యత
యువతలో జీవితం కలర్ఫుల్గా అనిపించినా, వయసు పెరిగే కొద్దీ అది భారంగా మారుతుంది. జీవిత చరమాంకం కూడా సూపర్‌హిట్ కావాలంటే, రిటైర్మెంట్ ప్లాన్ పక్కాగా ఉండాలి. మీరు శేష జీవితాన్ని విశేషంగా గడపాలంటే ఆస్తులు కూడబెట్టడం కాదు; నెలకు కచ్చితమైన పెన్షన్ వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. ఉదాహరణకు, మీరు ఇప్పుడు ముప్పయ్ ఏళ్ల వయసులో ఉంటే, రిటైర్మెంట్కు చేరుకునే నాటికి నెలకు రూ.2 లక్షలు ఖాతాలో పడేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే ప్రశాంత జీవితానికి అవకాశముంటుంది.
కొత్త పెన్షన్ విధానం
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాత విధానంలో ఉన్న స్థిరమైన పెన్షన్ పొందలేరు. ప్రైవేట్ ఉద్యోగుల విషయానికి వస్తే, రిటైర్మెంట్ తర్వాత కనీసం రూ.లక్ష నెలనెలా వచ్చేలా పెన్షన్ ప్లాన్ చేయడం అత్యవసరం. నెలకు రూ.20 వేల చొప్పున ఎస్ఐపీ (SIP) చేస్తే, నలభై ఏళ్ల వయసులో దాదాపు రూ.2 కోట్లకు చేరతాయి. ఆ మొత్తం నుంచి నెలవారీగా ఆదాయం పొందేలా పెట్టుబడులు పెట్టడం అవసరం.
పైసా మే పరమాత్మ
ఈ మాటలు కఠినంగా అనిపించినా, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మానవ సంబంధాలు ఆర్థిక స్థితి చుట్టూనే తిరుగుతున్నాయి. నెలకు స్థిరమైన ఆదాయం లేకుండా ఉంటే వృద్ధాప్యంలో ఆశించిన ఆదరణ దక్కకపోవచ్చు. అదే మీకు పెన్షన్ వస్తే, మీ విలువ మారిపోతుంది. కేవలం ఆస్తుల కోసం ఎదురు చూడడం కాదు; నెలనెలా వచ్చే ఆదాయం వారసులను మీకు అపురూపంగా మారుస్తుంది.
ఆయుష్షును పెంచే ఆర్థిక ప్రణాళిక
వృద్ధాప్యంలో మీ ఆరోగ్య సమస్యలపై కుటుంబం శ్రద్ధ చూపేలా, ఆసుపత్రి ఖర్చులు భరించేలా, మీ పథకాలు ఉండాలి. కొడుకులు కూడా మీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తారు. వారసులు సంతోషంగా ఉంటే, మీ ఆయుష్షు పెరిగినట్లే!
సంస్కారవంతమైన రిటైర్మెంట్ జీవితానికి
ప్రస్తుత పరిస్థితుల్లో, పెన్షన్ పొందే వృద్ధులు శతాధిక వయసు ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నారు. ఈ తరహా ఆర్థిక ప్రణాళికలు మాత్రమే వృద్ధాప్యాన్ని అందంగా తీర్చిదిద్దుతాయి. అందుకే, ముందుగా ఆలోచించి రిటైర్మెంట్ ప్రణాళిక సిద్ధం చేసుకోవడం చాలా అవసరం. అప్పుడే మీరు కూడా “పెన్షనర్‌కు శ్రీరామ రక్ష” అనిపించుకోగలుగుతారు.
