మందు, మజా, చర్చలో ఎమ్మెల్యే రచ్చ!

ఆంధ్రప్రదేశ్: మందేసి.. చిందేసి.. ఎమ్మెల్యే రచ్చ రచ్చ..!

బాపట్ల వార్తలు: ప్రభుత్వ కార్యక్రమాల్లో మనం ప్రోటోకాల్ పాటించే పరిస్థితులు చూస్తుంటాం. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారికి దక్కే గౌరవం అదే. కానీ బాపట్లలో ఒక నాయకుడు పుట్టిన రోజు వేడుకల్లో షాంపైన్ బాటిల్ ఓపెన్ చేస్తూ, తాగుతూ, చిందేస్తూ కనిపించడం ఇప్పుడు చర్చకు దారితీసింది.

పాండురంగాపురం బీచ్ వేదిక:
డిసెంబర్ 11న బాపట్ల బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ పుట్టిన రోజును పురస్కరించుకుని, పదో తేదీ అర్థరాత్రి నుంచే పాండురంగాపురం బీచ్ వద్ద భారీగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, వైసీపీ నేత అనంతవర్మ, ఇతర నాయకులు, అనుచరులు పాల్గొన్నారు.

వైరల్ వీడియోలు:
ఈ వేడుకలలో ఎమ్మెల్యే నరేంద్రవర్మ మందు గ్లాసు పట్టుకుని చిందేయడం, షాంపైన్ బాటిల్ ఓపెన్ చేస్తూ ఇతరులతో సంభాషణలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. “అన్నీ ఆయనే ఓపెన్ చేయాలా?” అంటూ ఒకరు చెప్పినప్పుడు, “ప్రోటోకాల్” అంటూ ప్రత్యుత్తరమిచ్చిన అనంతవర్మ, చివరికి ఎమ్మెల్యే నరేంద్రవర్మ బాటిల్ ఓపెన్ చేయడం వంటి సంఘటనలు ఇప్పుడు ప్రజల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి.

వీడియోల వెనుక కథ:
ఈ పుట్టిన రోజు వేడుకలు జరిగి వారం తర్వాత ఆ వీడియోలు బయటకు రావడం, వాటిని కావాలనే వేడుకల్లో పాల్గొన్నవారే విడుదల చేశారని కొందరు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణ వేడుక కానీ…
ప్రైవేట్ వేడుకల్లో మందేయడం, మ్యూజికల్ నైట్ వంటి కార్యక్రమాలు సాధారణమే. కానీ బాపట్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్సీ వంటి ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొనడంతో ఈ సంఘటనపై సర్వత్రా చర్చ సాగుతోంది.