నూతన సంవత్సర వేడుకలు: విజయవాడలో ఉత్సాహం, ఆంక్షలు

నూతన సంవత్సరం వేడుకల సందడి

విజయవాడ: నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు విజయవాడ నగర ప్రజలు జోష్‌తో సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 31 వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ స్టార్ సింగర్లు, ప్రఖ్యాత టీవీ యాంకర్లు పాల్గొనగా పలు ప్రాంతాల్లో డీజే షోలు, సంగీత కచేరీలు నిర్వహించబోతున్నారు. హోటళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మద్యం విక్రయాలు భారీగా ఉండొచ్చని వ్యాపారులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా మద్యం డిపోల నుంచి పెద్ద మొత్తంలో నిల్వలను కొనుగోలు చేశారు.

మద్యం అమ్మకాల సమయాన్ని ఈరోజు, రేపు రాత్రి ఒంటిగంట వరకు పొడిగించినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. బెల్టు షాపుల ద్వారా విక్రయాలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అదనపు ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్ర సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు నిర్వహించనున్నారు. చెక్‌పోస్టుల్లో ప్రత్యేక మొబైల్ పార్టీలు ఏర్పాటు చేసి మద్యం అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు.

పోలీసుల ఆంక్షలు
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. శాంతి భద్రతలను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు జరపరాదని సూచించారు. పబ్బులు, క్లబ్బులు తదితర ప్రదేశాల్లో ఆమోదిత సమయానికి మించి కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.

అశ్లీల నృత్యాలు, అనుమానాస్పద డీజే కార్యక్రమాలపై గట్టి నిఘా ఉంచినట్లు తెలిపారు. వీటిని నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినోదం పేరుతో అసభ్య ప్రదర్శనలకు తావు ఇవ్వకూడదని సూచించారు. వేగంగా బైక్, కార్ రేసులు నిర్వహించడంపై నిషేధం విధించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక గస్తీ నిర్వహించనున్నారు.

ఇందుకు తోడు, ప్రజల భద్రతకు సంబంధించి పోలీసులు తీసుకున్న చర్యలు విజయవంతంగా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.