ఈ గేమ్ కీలకం
లిరెన్‌తో గుకేష్ 13వ రౌండ్ నేడు
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్
సింగపూర్: డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్, యువ గ్రాండ్‌మాస్టర్ గుకేష్ మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఉత్కంఠతరంగా సాగుతోంది. టోర్నీ ప్రారంభం నుండి ఇరువురు ఆటగాళ్లు ప్రతీ గేమ్‌లోనూ శ్రద్ధతో పావులు కదుపుతున్నారు. ఇప్పటివరకు జరిగిన 12 రౌండ్లలో ఇద్దరూ చెరో రెండు గేమ్‌లను గెలిచారు. మిగతా గేమ్‌లను డ్రాగా ముగించారు.
ఈ ఫలితంగా, ఇరువురికి ఆరేసి పాయింట్లు సమంగా ఉన్నాయి. టోర్నీ విజేతగా నిలవాలంటే 7.5 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో, టోర్నీలో మరో రెండు రౌండ్లే మిగిలి ఉన్నందున బుధవారం జరిగే 13వ రౌండ్ అత్యంత కీలకంగా మారింది.
ఈ రౌండ్లో విజయం సాధించిన ఆటగాడు టైటిల్‌కు మరింత చేరువ అవుతాడు. ఈ గేమ్ గెలిస్తే, ఆఖరి రౌండ్‌ను కనీసం డ్రాగా ముగించడమే సరిపోతుంది. మరి, లిరెన్ లేదా గుకేష్ మధ్య ఈ కీలకమైన పోరులో ఎవరి పైచేయి అవుతుందో 13వ రౌండ్ ద్వారా తేలనుంది.
