మంచు మోహన్ బాబు (Mohan Babu) ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. జల్పల్లిలోని తన నివాసంలో జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో, ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే మోహన్ బాబు ఎక్కడా కనిపించడం లేదని తెలుస్తోంది.
నిన్నటి నుంచి మోహన్ బాబును పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఆయన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఇక ఈ పిటిషన్పై విచారణను గురువారానికి వాయిదా వేయడంతో, మోహన్ బాబు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
మంగళవారం రాత్రి జల్పల్లిలోని తన నివాసంలో జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి పహాడీ షరీష్ పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మొదట 118(1) బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన తర్వాత, లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు గురువారం నాడు 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
ఇటీవల, మోహన్ బాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన పిటిషన్లో, పోలీసులు దర్యాప్తు చేపట్టకుండా, అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే, హైకోర్టు ఈ పిటిషన్ను విచారించిన అనంతరం, మోహన్ బాబు అభ్యర్థనను తిరస్కరించింది. తదుపరి దర్యాప్తు చేపట్టకుండా, అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్పై విచారణను గురువారానికి వాయిదా వేసింది.
