టిబెట్ Earthquake: టిబెట్‌లో భారీ భూకంపం.. 53కు చేరిన మృతుల సంఖ్య.. భారత్‌లోనూ ప్రకంపనలు..
హిమాలయ ప్రాంతాల్లో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తులో టిబెట్‌లో ఇప్పటివరకు 53 మంది మరణించారని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. 63 మంది గాయాలపాలైనట్లు తెలిపింది. మృతుల సంఖ్య మరియు గాయపడిన వారి సంఖ్య ఇంకా పెరగవచ్చని అంచనా వేసింది.
మంగళవారం ఉదయం, నేపాల్-టిబెట్ సరిహద్దుల సమీపంలో ఈ భారీ భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో భూకంపం టిబెట్‌లోని షిజాంగ్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఈ భూకంపం కారణంగా పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. భూకంపం తర్వాత రెండు సార్లు మరొక ప్రకంపనలు వచ్చాయి, వాటి తీవ్రత 4.7 మరియు 4.9గా నమోదయ్యాయి.
టిబెట్‌లో సహాయ చర్యలు ప్రారంభమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను వెలికితీసే పనులు జరుగుతున్నాయి.
ఈ భూకంపం ప్రభావం భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పడింది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తారు. అయితే ఎక్కడా నష్టం జరగలేదు.
హిమాలయ ప్రాంతాలైన నేపాల్, టిబెట్లలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2015లో నేపాల్‌లో 7.8 తీవ్రతతో జరిగిన భారీ భూకంపం కారణంగా 9,000 మందికి పైగా ప్రాణనష్టం జరిగింది. 22,000 మందికి పైగా గాయపడ్డారు. 5 లక్షల ఇళ్లకు పైగా నేలమట్టమయ్యాయి.
