టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ ఘాటు విమర్శలు చేశాడు. ఫిట్ గా లేనపుడు ఒక్క మ్యాచ్ కూడా ఆడవద్దని.. అయినా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతం గంభీర్ ఇలాంటి వాళ్లకు ఎందుకు అనుమతినిస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించాడు.
కాగా, ఇంగ్లండ్ తో ఆండర్సన్ – టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. ఇప్పటికి మూడు మ్యాచ్‌లు ముగియగా ఇంగ్లండ్ రెండు, భారత్ ఒకటి గెలిచింది. ఇదిలా ఉంటే.. భారత ప్రధాన పేసర్ బుమ్రా ఈ సిరీస్ లో కేవలం మూడు టెస్టులే ఆడతాడని యాజమాన్యం ముందుగానే ప్రకటించింది. ఫిట్ నెస్ సమస్యల ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా అతడిపై పనిభారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
దిలీప్ వెంగ్ సర్కార్ ఫైర్…
అందుకు తగ్గట్లుగానే తొలి టెస్టు ఆడిన బుమ్రాకు.. రెండో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చారు. తిరిగి లార్డ్స్ మూడో టెస్టు ఆడిన ఈ రైట్ ఆర్మ్ పేసర్.. తదుపరి మాంచెస్టర్ మ్యాచ్ లో ఆడతాడా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దిలీప్ వెంగ్ సర్కార్ బుమ్రా, టీమిండియా యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఒకవేళ టీమిండియాకు ఆడాలని అనుకుంటే ప్రతి ఒక్క ఆటగాడు తప్పక ఫిట్ గా ఉండాలి. ఫిట్ గా లేకుంటే అసలు ఒక్క మ్యాచ్ కూడా ఆడకూడదు. తొలి, రెండో టెస్టుకు మధ్య 7- 8 ఎనిమిది రోజుల విరామం వచ్చింది. అయినా సరే అతడు రెండో టెస్టు ఆడలేదు. గంభీర్, అగార్కర్‌లకు నచ్చుతుందేమో గానీ, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. అగార్కర్, గంభీర్‌లు ఇలాంటివి ఆమోదిస్తారేమో కానీ.. ఎక్కడా ఇలా జరగదు అంటూ దిలీప్ వెంగ్ సర్కార్ రెవ్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
టెస్టు మ్యాచ్ లలో బౌలర్ల ఎంపిక విషయంలో తను ఎలాంటి వ్యాఖ్యలు చేయనన్న వెంగ్ సర్కార్.. ఫిట్ గా ఉన్న ఆటగాళ్లు ఎవరైనా సరే జట్టు ప్రయోజనాల కోసం సిరీస్ లో అన్ని మ్యాచ్‌లు ఆడాలని సూచించాడు. అదే సమయంలో బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్.. ఒంటిచేత్తో జట్టును గెలిపించగల సత్తా అతడికి ఉందని ప్రశంసించాడు. అయితే, ఒక్కసారి జట్టుతో చేరిన తర్వాత వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడతా అంటే కుదరదు అంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా టెస్టు సిరీస్ లో టీమిండియాపై ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య జరిగే నాలుగో టెస్టు (జూలై 23- 27)కు మాంచెస్టర్ వేదిక కానుంది.
