దేశానికి పర్యావరణ పరిరక్షణలో అపూర్వ సేవలందించిన పద్మశ్రీ వనజీవి రామయ్య (85) ఇక లేరు. ఈ తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. జీవితమంతా మొక్కలు నాటి, వాటిని పరిరక్షిస్తూ జీవించిన ఆయనకు ‘వనజీవి’ అనే ఇంటిపేరు సంపాదించుకుంది. స్వగ్రామమైన ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో ఉన్న తన పొలాల్లోనే లక్షలాది మొక్కలు నాటి, వాటిని ప్రేమగా పెంచారు.
కోటికి పైగా మొక్కలు నాటి, అపూర్వ రికార్డు నెలకొల్పిన రామయ్యకు భారత ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించి గౌరవించింది. పర్యావరణ ప్రేమికులకే కాకుండా, యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఆయన మరణం పర్యావరణ ఉద్యమాలకు తీరని లోటుగా భావిస్తున్నారు. దేశమంతటా ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
వనజీవి రామయ్య మరణాన్ని తెలంగాణకు తీరని లోటుగా అభివర్ణిస్తూ, ఆయన పచ్చదనం కోసం చేసిన త్యాగాలు మరచిపోలేనివని భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) అన్నారు. పర్యావరణ పరిరక్షణను జీవితసత్యంగా భావించిన వనజీవి రామయ్య, పద్మశ్రీ అవార్డు ద్వారా గౌరవించబడిన మహనీయులుగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.
‘‘వృక్షో రక్షతి రక్షితః’’ అనే గొప్ప నినాదాన్ని జీవితంలో అనుసరిస్తూ, కోటికి పైగా మొక్కలు నాటి ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను తెలియజేసిన వనజీవి రామయ్య జీవిత లక్ష్యం అసాధారణమైనదిగా కేసీఆర్ ప్రశంసించారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, వనజీవి సేవలను స్మరించుకుంటూ ఆయన కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు.
Read More : మూసీ నది పునరుజ్జీవంపై సీఎం రేవంత్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు
