టర్కీ ఉగ్రవాదానికి మద్దతు.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భారత్‌.

సరిహద్దు ఉగ్రవాదంపై టర్కీ చూపుతున్న మొగ్గుదలపై భారత్ గట్టిగా స్పందించింది. పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు ఇస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో, భారత ప్రభుత్వం గురువారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలకు మద్దతు ఇవ్వడం మానేసి, దశాబ్దాల నాటి ఉగ్రవాద వ్యవస్థను అరికట్టాలని భారతదేశం సూచించింది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా వాడొద్దని పాకిస్థాన్‌ను తేల్చి చెప్పాల్సిన అవసరం టర్కీపై ఉంది” అని తెలిపారు. దేశాల మధ్య సంబంధాలు పరస్పర గౌరవం, ఒకరిపై మరొకరు చూపించే సున్నితతపైనే ఆధారపడి ఉంటాయని ఆయన అన్నారు.

ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం టర్కీ, పాకిస్థాన్‌కు మద్దతుగా నిలవడంతో భారత్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో పాకిస్థాన్‌కు టర్కీ ఆయుధాలు, డ్రోన్లు సరఫరా చేసినట్లు అధికారిక నివేదికలు వెల్లడించాయి.

ప్రభుత్వ ప్రకటనల ప్రకారం, టర్కీ నుంచి సరఫరా అయిన 300-400 డ్రోన్లను పాకిస్థాన్ భారత సరిహద్దుల్లో చొరబాట్లకు, భారత గగనతల ఉల్లంఘనలకు వినియోగించింది. లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు 36 ప్రాంతాల్లో ఈ డ్రోన్లు చొరబాట్లకు పాల్పడినట్లు వెల్లడించారు.

అంతేకాకుండా, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్ర శిబిరాలపై భారత దళాలు జరిపిన ప్రతీకార దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినప్పుడు, టర్కీ మాత్రం పాకిస్థాన్‌కు సంఘీభావం ప్రకటించిందని కేంద్రం ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాక, టర్కీ తాము కరాచీ పోర్ట్‌ను యుద్ధనౌకతో సందర్శించడం సాధారణ పోర్ట్ కాల్‌గా పేర్కొనడం సైనిక ఉద్దేశమేనన్న అనుమానాలకు తావిచ్చింది.

ఈ చర్యలతో భారత్-టర్కీ సంబంధాలు మరింత ప్రతికూలంగా మారుతున్నట్లు సమాచారం. భారత్, టర్కీకి స్పష్టమైన హెచ్చరికను ఇచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

One thought on “టర్కీ ఉగ్రవాదానికి మద్దతు.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భారత్‌.

Comments are closed.