అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, రష్యాలను అమెరికా పూర్తిగా కోల్పోయిందని, ఆ రెండు దేశాలు ఇప్పుడు ‘చీకటి చైనా’ వైపు మొగ్గు చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు.
“మనం భారత్, రష్యాలను చీకటి చైనాకు కోల్పోయినట్టే కనిపిస్తోంది. ఆ మూడు దేశాలు కలిసి సుదీర్ఘకాలం ముందుకు సాగాలని ఆశిస్తున్నా” అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. ఇటీవల చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆతిథ్యం ఇవ్వగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొన్నారు. ఈ ముగ్గురు నేతలు ఇంధనం, భద్రత తదితర రంగాల్లో సహకారం పెంపుపై చర్చించారు. ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ వాణిజ్యం వంటి అంశాల్లో అమెరికాతో విభేదాలు ఉనికిలో ఉన్న సంగతి తెలిసిందే.
భారత్–రష్యా–చైనా మధ్య బలపడుతున్న బంధాన్ని ట్రంప్ ఇంత బహిరంగంగా అంగీకరించడం ఇదే మొదటిసారి. గత దశాబ్దాలుగా భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తూ చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా అమెరికా న్యూఢిల్లీతో బలమైన సంబంధాలను కొనసాగిస్తోంది. కానీ ట్రంప్ పాలనలో విధించిన సుంకాలు, వాణిజ్య పరిమితులు కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే.
Read More : నైజీరియాలో పడవ బోల్తా: 60 మందికి పైగా మృతి
One thought on “ట్రంప్ : భారత్, రష్యాను అమెరికా కోల్పోయిందా?”
Comments are closed.