రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్కులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. దేవాలయ దర్శనం నుంచి తిరిగి వస్తున్న సమయంలో 7 ఏళ్ల కుర్రాడిని పులి దాడి చేసి చంపేసింది . బుండీ జిల్లా నుంచి కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన కర్తిక్ సుమన్ అనే చిన్నారి ఈ దారుణానికి బలయ్యాడు.
చిన్నారి నానమ్మ చెబుతున్న వివరాల ప్రకారం… తాను తన మనవడి చేతిని పట్టుకుని నడుస్తుండగా, అడవి పొదల మధ్య నుంచి అకస్మాత్తుగా బయటకు వచ్చిన పులి చిన్నారిపై దాడి చేసింది. టైగర్ చిన్నారి మెడ పట్టుకుని , అతడిని అడవిలోకి లాగింది. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు కన్నులార చూశారు కానీ ఏమీ చేయలేక విలపించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి గాలింపు చేపట్టి చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించారు.
ఈ విషాద సంఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ… “చిన్నారి తన నానమ్మతో కలిసి దేవాలయం నుండి తిరిగి వస్తున్న సమయంలో అకస్మాత్తుగా పులి వచ్చి మెడ పట్టుకుని అడవిలోకి లాగేసింది” అని చెప్పారు.
ఈ దాడికి కారణమైన పులిని అధికారులు ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు. ఆ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా కనీసం మూడు పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటన రణతంబోర్ పరిసర గ్రామాల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఘటనపై స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి కిరోడి లాల్ మీనా… పిల్లవాడి కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. త్రినేత్ర గణేష్ మందిరానికి వెళ్లే ఈ మార్గం భద్రత విషయంలో అధికారులపై ప్రశ్నలు సంధించారు.
ఇప్పటికి రణతంబోర్ అభయారణ్యంలో 70కు పైగా పులులు నివసిస్తున్నాయని అధికారులు తెలిపారు. పులుల జీవన పరిధి, ఆహారం కోసం పోటీ నేపథ్యంలో… అడవిలో స్థలాన్ని ఆక్రమించుకునే పోరులో అవి తరచూ గ్రామాలు, మానవ నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకొస్తున్నాయని అటవీశాఖ అంచనా వేసింది.
ఈ ఘటన మరొక్కసారి మానవ-వన్యప్రాణి సంఘర్షణ విషమతను చాటిచెప్పింది.
Read More : ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లో మూగ-చెవిటి బాలికపై దారుణ అత్యాచారం…
