విమాన ప్రమాదంతో వాయిదా పడిన టెండూల్కర్ ?

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రభావం క్రికెట్ పైన కూడా పడింది. ఈ దుర్ఘటన కారణంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ పేరుతో ప్రారంభించనున్న ప్రతిష్ఠాత్మక ‘టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ’ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు.

ఈ కార్యక్రమాన్ని జూన్ 14న లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు ఇది ఓ గొప్ప ప్రారంభ వేడుకగా ఉండనుంది. సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. అయితే భారత్‌లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని కలిగించడంతో రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఒక అభిప్రాయానికి వచ్చి ఈ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి.

ఇప్పటి వరకు భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ విజేతలకు పటౌడీ ట్రోఫీ అందించేవారు. కానీ ఈసారి క్రికెట్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన సచిన్ టెండూల్కర్, జేమ్స్ అండర్సన్‌ల గౌరవార్థంగా వారి పేర్లతో కొత్త ట్రోఫీని ప్రారంభించేందుకు నిర్ణయించారు.

ప్రస్తుతం వాయిదా పడిన ఈ కార్యక్రమానికి సంబంధించి కొత్త తేదీని ఇంకా నిర్ణయించలేదు. దీనిపై బీసీసీఐ, ఈసీబీ అధికారులు పరస్పర చర్చలు కొనసాగిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read More : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను తొలిసారిగా గెలుచుకున్న సౌతాఫ్రికా