జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేతిరెడ్డి తీవ్ర విమర్శలు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై మండిపడ్డారు. మంగళవారం అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన, “తాడిపత్రికి వెళ్లాలంటే వీసా కావాలా? జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి తీసుకోవాలా?” అంటూ ప్రశ్నించారు. తాడిపత్రిలోకి తనను పోలీసులు అనుమతించడం లేదని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కడికెళ్లినా పోలీసులు వెంటాడుతున్నారని పెద్దారెడ్డి విమర్శించారు. తాడిపత్రి పోలీసుల వైఖరి ఏకపక్షంగా ఉందని ఆరోపించారు. “జేసీ వర్గీయులు వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నా పోలీసులు మౌనం వహిస్తున్నారు. జేసీకి నిజంగా ధైర్యం ఉంటే అభివృద్ధి పనుల్లో పోటీ పడాలి” అని సవాల్ విసిరారు.

హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తాడిపత్రిలోకి ప్రవేశం నిరాకరించడాన్ని ఆయన ఖండించారు. “పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి చేతుల్లో బందీగా మారారు. తాడిపత్రిలో జరుగుతున్న అరాచకాలకు సిట్ విచారణ జరగాలి. అప్పుడు ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు అనేది తేలుతుంది” అని స్పష్టం చేశారు. “తాడిపత్రి ప్రజలు నన్ను అడ్డుకుంటే నా ఇల్లు రాసేస్తా. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజల అండ లేకుండా, పోలీసుల సహాయంతో కుట్రలు చేస్తున్నారు” అని పెద్దారెడ్డి ఆరోపించారు. “ప్రజల నుంచి అక్రమ వసూళ్లు ఆపాలి. తాడిపత్రి ప్రజలు నాకు 80 వేల ఓట్లు ఇచ్చారు. అందుకే ప్రజలు నన్ను వ్యతిరేకించడం లేదు” అని కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు.

Read More : ప్రభుత్వ సంక్షేమం చూసి వైసీపీకి ఓర్వలేకపోతున్నారు: మంత్రి అనిత

One thought on “జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేతిరెడ్డి తీవ్ర విమర్శలు

Comments are closed.