భారత్-పాక్ క్రికెట్ సంబంధాలపై గంగూలీ కీలక వ్యాఖ్యలు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగిన సంగతి తెలిసిందే. పరస్పరం ఆంక్షలు విధించుకుంటూ రాజకీయంగా గడ్డు వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసింది. భవిష్యత్తులో పాకిస్తాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగవని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.

తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఈ అంశంపై స్పందించారు. “పాకిస్తాన్‌తో అన్ని రకాల క్రికెట్ సంబంధాలను తక్షణమే తెంచుకోవాలి. కఠిన చర్యలు అవసరం. ప్రతి సంవత్సరం ఇలాంటి ఉగ్రదాడులు జరగడం సరైనది కాదు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సహించలేం” అంటూ గంగూలీ స్పష్టం చేశారు.

ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ జట్లు కేవలం టీ20, వన్డే ప్రపంచకప్‌లు, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి అంతర్జాతీయ టోర్నీల్లో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయి. గంగూలీ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఈవెంట్లపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాల్సి ఉంది.

2008 ముంబయి ఉగ్రదాడి తర్వాత నుంచి భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగడం లేదు. చివరిసారి 2012-13లో భారత్‌లో పాకిస్థాన్ జట్టు పర్యటించింది.

ఇటీవల జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా భారత్, పాకిస్తాన్ వెళ్లకుండా హైబ్రిడ్ మోడల్ ప్రకారం దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రెండు దేశాల క్రికెట్ సంబంధాలు మరింత దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Read More : దీపక్ హుడా పూర్ ప్రదర్శన.. సీఎస్‌కే ఓటమికి కారణం!