‘రామం: ది రైజ్ ఆఫ్ అఖిరా’ – శ్రీరామనవమి సందర్భంగా భారీ చిత్రానికి శ్రీకారం

Ramam The Rise of Akhira

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దొనేపూడి నిర్మాణంలో ఓ విభిన్నమైన పాన్ ఇండియా సినిమాకు శ్రీకారం చుట్టారు. ‘రామం: ది రైజ్ ఆఫ్ అఖిరా’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు లోకమాన్య దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ దర్శకుల వద్ద శిక్షణ పొందిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్, శ్రీరాముని తత్త్వాన్ని ఆధునిక భావజాలంతో మిళితం చేస్తూ కొత్త కోణంలో తెరపైకి తీసుకురానున్నారు. ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ఆల్రెడీ సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

సాధారణ పౌరాణిక చిత్రాలకు భిన్నంగా ఈ కథ ఆధునిక విజువల్స్, సాంకేతికంగా కొత్తగా రూపొందనుంది. ‘అఖిరా’ అనే పాత్ర ధర్మ పరిరక్షణ కోసం సాగించే యాత్రలో, శ్రీరాముని మార్గాన్ని అనుసరిస్తూ ప్రతినాయకత్వాన్ని ఎదిరించే తత్వాన్ని ప్రతిబింబించనుంది. “శ్రీరాముని నామం ఈ దేశానికి మార్గదర్శక మంత్రం లాంటిది. ఆయన ధైర్యమే ఈ కథకు ప్రేరణ,” అని నిర్మాత వేణు దొనేపూడి పేర్కొన్నారు. ఈ చిత్రంలో హీరోగా ఓ యువ టాలీవుడ్ నటుడు నటించనున్నాడు. వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనుండటంతో ప్రముఖ నటులు, టెక్నీషియన్లు ఇందులో భాగమవుతున్నారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. మోషన్ పోస్టర్‌లో అఖిరా వేషధారణ, చేతిలో ‘జై శ్రీరామ్’ పతాకం, గుర్రపు స్వారీ వంటి సన్నివేశాలు సినిమా తత్త్వాన్ని సమగ్రంగా చాటుతున్నాయి. ఈ కథ ద్వారా రామరాజ్యాన్ని ఓ కొత్త కోణంలో వివరించబోతున్నారు మేకర్స్. టాలీవుడ్‌కు మరో విజువల్ ట్రీట్ రానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read More

One thought on “‘రామం: ది రైజ్ ఆఫ్ అఖిరా’ – శ్రీరామనవమి సందర్భంగా భారీ చిత్రానికి శ్రీకారం

Comments are closed.