ఉక్రెయిన్‌కు మద్దతుగా బలగాల మోహరింపు శాంతికి దోహదం కాదు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలను చట్టబద్ధమైన లక్ష్యాలుగా పరిగణించే అధికారం రష్యాకే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా ఎలాంటి దేశాలు తమ సైనిక దళాలను మోహరించినా, రష్యా వాటిని లక్ష్యంగా చేసుకుంటుందని హెచ్చరించారు.

ఉక్రెయిన్‌లో బలగాల మోహరింపు ఎట్టి పరిస్థితుల్లోనూ దీర్ఘకాలిక శాంతికి దోహదం చేయదని పుతిన్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ దేశాలతో ఉక్రెయిన్ కొనసాగిస్తున్న సన్నిహిత సైనిక సంబంధాలే ప్రస్తుత యుద్ధానికి మూల కారణమని ఆయన వ్యాఖ్యానించారు.

ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు విజయవంతమైతే, మరెందుకు సైనిక దళాలను మోహరించాలనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. నిజంగా శాంతి కావాలంటే బలగాల మోహరింపుకు అవసరం ఉండదని పుతిన్ తేల్చి చెప్పారు. రష్యా చేసుకున్న ఒప్పందాలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

ప్యారిస్‌లో 26 యూరప్ దేశాల నేతలు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమైన నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read More : ట్రంప్ : భారత్, రష్యాను అమెరికా కోల్పోయిందా?