పక్క రాష్ట్రాల్లోను అనుమతితో ట్యాపింగ్‌కు వీలు!

కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన టెలికమ్యూనికేషన్స్ నిబంధనలు – 2024 ముసాయిదాలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. చట్టబద్ధమైన ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో సవరణలు చేస్తూ కమ్యూనికేషన్ శాఖ ఈ ముసాయిదాను రూపొందించింది. ప్రస్తుతం వర్తిస్తున్న నిబంధనల ప్రకారం, ఫోన్ ట్యాపింగ్‌కు కేంద్ర స్థాయిలో హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర స్థాయిలో ఆయా రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులకు మాత్రమే అనుమతించే అధికారం ఉంది. అయితే తాజాగా విడుదలైన ముసాయిదాలో, ఒక రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాదేశిక హద్దులకు వెలుపల ఉన్న వ్యక్తి ఫోన్‌ను కూడా అనుమతి తీసుకుని ట్యాప్ చేసుకునేలా నిబంధనను చేర్చింది.

ఈ సవరణతో, పక్క రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తుల ఫోన్లను కూడా ఒక రాష్ట్రం తన అనుమతితో ట్యాప్ చేసేందుకు అవకాశాలు ఏర్పడనున్నాయి. దేశవ్యాప్తంగా వ్యక్తిగత గోప్యతపై ఈ కొత్త ప్రతిపాదన చర్చనీయాంశంగా మారనుంది.

Read More : తెలంగాణ గురుకులాల పరిస్థితిపై హరీశ్ రావు ఆవేదన.