రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” సినిమా పై భారీ అంచనాలున్నాయి. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. అయితే, ఈ గ్లింప్స్ గురించి కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. టీజర్ కట్ ఆకట్టుకుంటుందన్న టాక్ ఉన్నప్పటికీ, ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆశించిన స్థాయిలో లేదని వార్తలు వినిపించాయి.
ఈ రూమర్లపై చిత్ర యూనిట్ సభ్యులు స్పష్టతనిచ్చారు. గ్లింప్స్ కోసం రెహమాన్ ప్రత్యేకంగా క్రియేటివ్ సౌండింగ్ రూపొందించినట్టు, ఏప్రిల్ 6న వీడియో విడుదల తర్వాత అందరికీ నిజం తెలుస్తుందని తెలిపారు. గతంలోనే రెహమాన్ ఈ సినిమా కథ తనకు ఎంతో నచ్చిందని, చిత్రానికి మ్యూజిక్ ఇవ్వడం ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఉందని చెప్పాడు. అంతేకాకుండా, సినిమా ప్రారంభించకముందే మూడు ట్యూన్స్ కంపోజ్ చేయడం ఇదే మొదటిసారి అని టాక్. రెహమాన్ ఇలా ముందుగానే ట్యూన్స్ కంపోజ్ చేయడం సాధారణం కాదని, బీజీఎం విషయంలోనూ అదే స్థాయి క్రియేటివిటీ కనబరిచాడని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. కర్నాటక సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు బుచ్చిబాబుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాదిలోనే సినిమా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. రెహమాన్ మ్యూజిక్, రామ్ చరణ్ ఎనర్జీతో “పెద్ది” ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

One thought on “పెద్ది మూవీపై రూమర్లకు ముగింపు: రెహమాన్ బీజీఎం క్లారిటీ”
Comments are closed.