భారత్–పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ మరోసారి రెచ్చిపోయింది. శనివారం అర్ధరాత్రి 1:40 గంటల సమయంలో పంజాబ్‌లోని ఒక ఎయిర్ బేస్‌పై హై స్పీడ్ మిస్సైల్‌తో దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే భారత రక్షణ వ్యవస్థలు సకాలంలో స్పందించడంతో ఈ మిస్సైల్ దాడి విఫలమైంది.
ఇదిలా ఉండగా, నియంత్రణ రేఖ (LOC) వెంబడి పాకిస్థాన్ పలు రకాల సాయుధ దాడులకు పాల్పడింది. అనేక డ్రోన్లు, లాంగ్ రేంజ్ ఆయుధాలు, సాయుధ యుద్ధ విమానాలతో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగింది. అయితే భారత భద్రతా దళాలు అప్రమత్తంగా స్పందించాయి. అన్ని వైపుల నుంచి వచ్చిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో విజయవంతమయ్యాయి.
ఈ దాడులపై స్పందించిన కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ, “పాకిస్థాన్ అనేక విధాలుగా దాడికి యత్నించినా, భారత సైన్యం వాటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంది. డ్రోన్లు, హై టెక్ ఆయుధాలను సమర్థవంతంగా నిర్వీర్యం చేయగలిగాం” అని తెలిపారు.
ప్రస్తుతం పంజాబ్‌తో పాటు జమ్మూకశ్మీర్, రాజస్థాన్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆకాశంలో మిస్సైల్‌లు, డ్రోన్ల మంటలు చెలరేగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read More : ఢిల్లీలో 138 విమానాల రద్దు, సరిహద్దుల్లో గగనతల యుద్ధం.

One thought on “పంజాబ్ ఎయిర్ బేస్‌పై పాక్ మిస్సైల్ దాడి యత్నం.”
Comments are closed.