లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ.

కొన్ని సినిమాలు థియేటర్ రిలీజ్ కోసం ప్లాన్‌ చేసినా, పరిస్థితుల వల్ల ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. కానీ ‘లిటిల్ హార్ట్స్’ మాత్రం దీనికి విరుద్ధంగా సాగింది. మొదట ఓటీటీ కోసం నిర్మించిన ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీని నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి చూసి, ఇది థియేటర్‌లో బాగా ఆడుతుందని భావించి సినిమాను ముందుగా థియేటర్లలో విడుదల చేశారు.

‘90స్ మిడిల్ క్లాస్’ సినిమాతో గుర్తింపు పొందిన మౌళి తనూజ్ హీరోగా, అదే దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రానికి సాయి మార్తండ్ దర్శకత్వం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ: అఖిల్ (మౌళి) ఇంజినీరింగ్ సీటు రాకపోవడంతో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటాడు. అదే కోచింగ్ సెంటర్‌లో ఎంబీబీఎస్ సీటు కోసం కాత్యాయిని (శివానీ నాగారం) చేరుతుంది. అఖిల్–కాత్యాయిని మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ ఒక అనుకోని నిజం వారి బంధానికి అడ్డంకిగా మారుతుంది. ఆ అడ్డంకి ఏమిటి? చివరికి వారి ప్రేమ ఫలించిందా? అనేదే కథ.

విశ్లేషణ: ఈ సినిమా ప్రధానంగా కామెడీపై ఆధారపడి సాగింది. సింపుల్ లవ్ స్టోరీకి డైరెక్టర్ ఆకట్టుకునే వన్‌లైనర్ జోకులు జోడించి వినోదాన్ని అందించారు. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. మౌళి, రాజీవ్ కనకాల, శివానీ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేశాయి. సెకండ్ హాఫ్‌లో కూడా కామెడీ కొనసాగింది. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మరింత బలంగా ఉంటే సినిమా ఇంకా బెటర్‌గా అనిపించేది.

నటీనటుల పనితీరు: మౌళి తన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. శివానీ నాగారం పాత్రలో బాగా నటించింది. జయకృష్ణ స్నేహితుడి పాత్రలో మంచి కామెడీ పంచాడు. రాజీవ్ కనకాల, అనిత చౌదరి, ఎస్‌.ఎస్‌.కాంచీ, సత్యకృష్ణన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం వినసొంపుగా, కథలో సహజంగా మిళితమై వినోదాన్ని కలిగించింది.

మొత్తం మీద, వినోదాత్మక సన్నివేశాలు, సరదా వన్‌లైనర్లు ఇష్టపడే ప్రేక్షకులకు ‘లిటిల్ హార్ట్స్’ ఒక లైట్ హార్టెడ్ ఎంటర్‌టైనర్‌గా అనిపిస్తుంది.

Director: Sai Martand
Music: Sinjit Yerramalli
Banner: ETV Win Original Productions
Rating: 2.50/5

Read More : బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ దక్కించుకున్న మీనాక్షి చౌదరి.