కేరళ యువ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్‌పై తీవ్ర లైంగిక ఆరోపణల వివాదం నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. ఆయనను ఆరు నెలలపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసినట్లు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో రాహుల్ పార్టీ కార్యకలాపాలు, శాసనసభా పక్ష సమావేశాలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఇప్పటికే ఈ వివాదం వెలుగులోకి రాగానే, ఆయనను యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. కానీ ఆరోపణల తీవ్రత పెరుగుతుండటంతో మరింత కఠిన చర్య తప్పనిసరైంది. కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, సీనియర్ నేత రమేశ్ చెన్నితాల చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మాత్రం పార్టీ కోరలేదు. పాలక్కాడ్ ఉప ఎన్నిక జరిగితే రాజకీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే కారణంతోనే సస్పెన్షన్ నిర్ణయానికే పరిమితమయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదట రాజీనామా ఆలోచనలో ఉన్నప్పటికీ, న్యాయనిపుణుల సలహాతో ఈ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఈ వివాదంలో ట్రాన్స్‌జెండర్ మహిళ అవంతిక చేసిన ఆరోపణలతో పాటు, ఒక మహిళను బెదిరిస్తున్న ఆడియో క్లిప్ బయటకు రావడం సంచలనం సృష్టించింది. ఆ క్లిప్‌లోని గొంతు తనది కాదని రాహుల్ స్పష్టంగా ఖండించకపోవడం, ఫోరెన్సిక్ విచారణ కోరకపోవడం ఆయనపై అనుమానాలు మరింత పెంచుతోంది.
ఇక, మహిళా కమిషన్‌తో పాటు బాలల హక్కుల కమిషన్ కూడా ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించాయి. ఇదే సమయంలో సీపీఎం, బీజేపీలు రాహుల్ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టాయి. కాంగ్రెస్ మాత్రం ప్రస్తుతానికి సస్పెన్షన్ చర్యతో వివాదాన్ని చల్లార్చాలని భావిస్తోంది.
Read More : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

One thought on “కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్ సస్పెన్షన్ ?”
Comments are closed.