హీరోలతో సమాన పారితోషికం రావాల్సిందే!

మహిళా నటులకు హీరోలతో సమానంగా పారితోషికం చెల్లించాలని గత కొంతకాలంగా బాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తున్న డిమాండుకు తాజాగా సౌతిండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తనదైన శైలిలో మద్దతు తెలిపారు. దీపికా పదుకోణే, విద్యా బాలన్, కరీనా కపూర్, అలియా భట్, కత్రినా కైఫ్ లాంటి బాలీవుడ్ నాయికలు ఇప్పటికే ఓపెన్‌గా ఈ విషయాన్ని ప్రశ్నించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరోసారి బలపరిచాయి. “ఒక హీరోని చూసి ప్రేక్షకులు థియేటర్‌కు ఎలా వస్తారో, అలాగే ఓ హీరోయిన్ కోసం కూడా వస్తే.. ఆమెకు సమాన పారితోషికం ఇవ్వాల్సిందే. అలాంటి స్థాయికి వచ్చిన వాళ్లకు డిమాండ్ చేసే హక్కు ఉంటుంది” అని కీర్తి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే తన వంతుగా మాత్రం పారితోషికం తుదిపరిశీలన అంశమని, మొదట కథ, పాత్రకే ప్రాధాన్యతనిస్తానని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తాను చేసిన ప్రతి సినిమాలో ఇదే విధానాన్ని పాటించానని చెప్పారు. కీర్తితో పాటు మృణాల్ ఠాకూర్ కూడా ఇదే విధంగా పారితోషికం కంటే పాత్రకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు ఎంపిక చేసుకుంటున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే, చాలా మంది నాయికలు మాత్రం ముందుగా పారితోషికంపైనే చర్చలు జరిపి తర్వాతే పాత్ర స్వీకరించేవారు. పారితోషికం సంతృప్తికరంగా లేకపోతే పెద్ద అవకాశం వచ్చినా నిరాకరిస్తుంటారు.

ఇటువంటి ధోరణికి నిర్మాతలు కూడా కొంత మేర కారణమే. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న హీరోయిన్లకు ఎక్కువ పారితోషికం ఇవ్వడంతో, వాళ్లు ఇంకా డిమాండ్ పెంచేస్తున్నారు. ఈ వ్యవస్థలో మార్పు అవసరమని నిర్మాత దిల్ రాజు అప్పుడప్పుడూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు.

ఇలాంటి సమయంలో కీర్తి సురేష్ లాంటి నటీమణుల వైఖరి పరిశ్రమలో సమతుల్యత ఏర్పడేందుకు మార్గం చూపుతుందని భావించవచ్చు.

Read More : నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్ విడుదల

One thought on “హీరోలతో సమాన పారితోషికం రావాల్సిందే!

Comments are closed.