భారత క్రికెట్‌లో టెస్టు ఫార్మాట్‌కి సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే ఇంగ్లండ్ పర్యటనకు ముందు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ క్రికెట్ నుంచి దూరంగా ఉండనున్నట్టు తెలుస్తుండటంతో, టాప్ ఆర్డర్‌లో ముఖ్యమైన నాలుగో స్థానంపై పెద్ద చర్చ ప్రారంభమైంది. గతంలో ఈ స్థానంలో విరాట్ కోహ్లీ నిలదొక్కుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ ఖాళీని ఎవరిస్తారన్న దానిపై చర్చలు సాగుతుండగా, భారత మాజీ కెప్టెన్, లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కీలక సూచన చేశారు. దేశవాళీ క్రికెట్‌లో మెరిసిన, ఐపీఎల్‌లో ఫామ్‌లో ఉన్న కరుణ్ నాయర్‌కు నాలుగో స్థానంలో అవకాశం ఇవ్వాలని సూచించారు.
కుంబ్లే మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకు దేశవాళీ క్రికెట్‌లో కరుణ్ నాయర్ అద్భుతంగా రాణించాడు. అతనికి టాలెంట్‌తో పాటు ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. కౌంటీ క్రికెట్ ఆడిన నేపథ్యం కూడా అతనికి ప్లస్ అయ్యే అంశం. అతను 33 ఏళ్ల వయస్సులోనూ ఎంతో ఫిట్‌గా ఉన్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతనిలో ఉంది’’ అని తెలిపారు.
ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో కరుణ్ నాయర్ విదర్భ తరఫున అత్యుత్తమంగా రాణించి, జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 53.93 సగటుతో 863 పరుగులు చేశాడు. నాలుగు శతకాలు, రెండు అర్ధశతకాలు సాధించాడు. దేశవాళీ క్రికెట్‌లోని టాప్ స్కోరర్లలో అతను నాలుగో స్థానంలో నిలిచాడు.
2016లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన కరుణ్, తన మూడో మ్యాచ్‌లోనే చెన్నైలో 303 నాటౌట్‌తో ట్రిపుల్ సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. 2017 మార్చిలో అతను చివరిసారి భారత జట్టుకు ఆడాడు.
ప్రస్తుతం ఐపీఎల్‌లో కరుణ్ నాయర్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఓపెనర్లుగా గిల్, జైస్వాల్ బరిలోకి దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, నాలుగో స్థానంలో కరుణ్‌కు అవకాశం దక్కుతుందా? అనేదే ఇప్పుడు క్రికెట్ అభిమానుల మద్ధటి ప్రశ్నగా మారింది. కుంబ్లే సూచనపై సెలెక్షన్ కమిటీ స్పందన ఏమవుతుందో వేచి చూడాలి.
Read More : భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్‌లో.?

One thought on “కరుణ్ నాయర్ : అనిల్ కుంబ్లే సూచన”
Comments are closed.