photos : విద్యార్థినిపై అత్యాచారం చేసిన అధ్యాపకులు

అధ్యాపక వృత్తికి మచ్చతెచ్చే ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. విద్యార్థినిపై ఇద్దరు అధ్యాపకులు, మరో వ్యక్తి కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో, ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. దక్షిణ కన్నడ జిల్లా మూడుబిదిరె ప్రాంతానికి చెందిన ఓ కళాశాలలో నరేంద్ర అనే అధ్యాపకుడు, తరచూ ఫోన్‌లో పాఠ్యాంశాల పేరుతో 19 ఏళ్ల విద్యార్థినితో సన్నిహితంగా మాట్లాడుతూ వచ్చాడు. ఇటీవల మరో అధ్యాపకుడు సందీప్‌తో కలిసి “కళాశాల పనిపై బెంగళూరుకు వెళ్తున్నాం” అంటూ ఆ విద్యార్థినిని కూడా తీసుకెళ్లాడు.
అంతా బెంగళూరులో సందీప్ స్నేహితుడు అనూప్ గదిలో బస చేశారు. ఈ క్రమంలో నరేంద్ర విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. అనంతరం సందీప్ “అంతా వీడియో తీశా” అంటూ బెదిరించి అతనూ అదే దారిలోనే వెళ్లాడు. చివరికి అనూప్ కూడా ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
విషయం బయటపెడితే పరువు పోతుందన్న భయం, కుటుంబ సభ్యుల నిరాకరణ ఉంటుందన్న సందేహంతో బాధిత యువతి మౌనం వహించింది. అయితే, తాజాగా తిరిగి కళాశాలకు వెళ్లిన సమయంలో అదే అధ్యాపకులు మళ్లీ వేధించడంతో, ఆమె తల్లిదండ్రుల సాయంతో రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మహిళా కమిషన్ సూచనల మేరకు మారతహళ్లి పోలీస్ స్టేషన్‌ అధికారులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. అరెస్టైన నరేంద్ర, సందీప్ అనే అధ్యాపకులతో పాటు అనూప్ అనే యువకుడిపై కూడా కేసు నమోదు చేశారు. విచారణలో ఈ అధ్యాపకులు గతంలోనూ కొందరిపై లైంగిక దాడులకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం లభించింది.

ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసులు అదుపులో ఉండగా, ఈ ఘటనపై సమాజం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Read More : వీధికుక్కల భోజనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

One thought on “photos : విద్యార్థినిపై అత్యాచారం చేసిన అధ్యాపకులు

Comments are closed.