భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో, నిన్న రాత్రి కరాచీ పోర్టుపై ఇండియన్ నేవీ క్షిపణి దాడులు జరిపిందన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అనేక పేలుళ్లు వినిపించాయని, పాకిస్థానీ నేవల్ బేస్లే లక్ష్యంగా దాడులు జరిగాయని అనధికారిక సమాచారం వెల్లడి కావడంతో అంతర్జాతీయంగా కలకలం రేగింది.
అయితే, ఈ వార్తలపై కరాచీ పోర్టు ట్రస్ట్ (KPT) స్పందిస్తూ, తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా హ్యాక్ అయిందని స్పష్టం చేసింది. భారత దళాలు దాడికి పాల్పడ్డాయని ప్రచారం అయిన వీడియో, సమాచారం పూర్తిగా తప్పుడు వివరాలతో కూడుకున్నదని ఖండించింది.
“మన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ చేయబడింది. అందులో వచ్చిన సమాచారం పూర్తిగా అసత్యం. మీడియాలో ప్రసారం చేసే ముందు అధికారికంగా మా పీఆర్ విభాగాన్ని సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం,” అని కేపీటీ స్పష్టం చేసింది.
ఇక మిలటరీ వర్గాల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో కరాచీలో జరిగిన పేలుళ్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఇంకా ఉత్కంఠ భరితంగా ఉండటంతో ప్రజలు, మీడియా, అంతర్జాతీయ సమాజం అధికారిక సమాచారం కోసం ఎదురు చూస్తున్నాయి.
మీడియా వర్గాలు, సోషల్ మీడియా వినియోగదారులు ఇటువంటి సున్నితమైన సమాచారాన్ని విచక్షణతో ప్రచారం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read More : మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మీడియా ఛానల్స్‌కు సూచన
