జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికపై రాజకీయ ఉత్సుకత పెరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. త్వరలో జరగనున్న ఉపఎన్నిక కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.
తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో స్థానిక అభ్యర్థికే కాంగ్రెస్ టికెట్ ఇస్తామని స్పష్టం చేశారు. “బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఉండదు. అందరి అభిప్రాయాలు సేకరించి పార్టీ అభ్యర్థిని ఖరారు చేస్తాం” అని చెప్పారు. బీఆర్ఎస్ కూడా తన సీటును కాపాడుకోవడానికి వ్యూహాలను రూపొందిస్తోంది. మాగంటి గోపినాథ్ భార్యకు టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఈ ఉపఎన్నిక కీలకంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్, కంటోన్మెంట్ ఉపఎన్నికలో విజయం సాధించి బలాన్ని చాటుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా అదే ఫలితం సాధించాలని కాంగ్రెస్ ఆశిస్తోంది.
ఈ సీటు కోసం కాంగ్రెస్‌లో ఫిరోజ్ ఖాన్, అజహరుద్దీన్, నవీన్ యాదవ్, గద్దర్ కుమార్తె వెన్నెల లాంటి నాయకులు రేసులో ఉన్నట్లు సమాచారం. టికెట్ ఎవరికి దక్కుతుందనేది చూడాలి. ఇక బీజేపీ కూడా తన అభ్యర్థి ఎంపికపై వ్యూహాలు రూపొందిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఉపఎన్నిక ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందో ఆసక్తికరంగా మారింది.
Read More : గోల్కొండ మిలిటరీ ప్రాంతంలో చిరుత కలకలం
