జయశంకర్ భూపాలపల్లిలో యువతి అనుమానాస్పద మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. కాటారం-భూపాలపల్లి జాతీయ రహదారి ప్రాంతంలో పోలీసులు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం లభించిన ఆధారాల ఆధారంగా మృతురాలిని ఒడితల గ్రామానికి చెందిన కప్పల వర్షిణిగా గుర్తించారు.

ఘటనా స్థలంలో అనుమానాలు:

మృతదేహం వద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయలు లభించడంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, ఇది క్షుద్రపూజలకు సంబంధించిన సంఘటనా? యువతిని బలిచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు వర్షిణికి సంబంధించిన ఆధార్ కార్డు కూడా ఘటనా స్థలంలో లభించడం ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. కాగా, ఈ నెల 6న చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఆమె మిస్సింగ్ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర ఆధారాలు లభిస్తే ఈ కేసులో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read More : మిలాద్-ఉన్-నబీ ఏర్పాట్లపై సీఎం రేవంత్‌తో ఒవైసీ సోదరుల భేటీ.