అమెరికా దాడుల నుంచి త్వరితగతిన కోలుకుంటున్న ఇరాన్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా జరిపిన భారీ వైమానిక దాడుల ప్రభావం నుంచి ఇరాన్ తేరుకోవడానికి వేగంగా చర్యలు చేపట్టింది. అమెరికా బాంబుల వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్న ఫోర్డో అణు ఇంధన శుద్ధి కర్మాగారం వద్ద పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

శాటిలైట్ చిత్రాల్లో ఏముంది?
జూన్ 27న మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాల్లో ఫోర్డో కేంద్రం వద్ద గణనీయమైన నిర్మాణం కనిపిస్తోంది. దాడుల్లో ధ్వంసమైన సొరంగ మార్గాలను తిరిగి శుభ్రపరచడానికి భారీ ఎత్తున ఎక్స్‌కవేటర్లు, బుల్డోజర్లు పనిచేస్తున్నాయి. అమెరికా వాడిన జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబుల దెబ్బల్ని అధిగమించేందుకు కీలక మార్గాల వద్ద మరమ్మతులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతేగాక, పర్వత ప్రాంతంలో కొత్త యాక్సెస్ రోడ్ల నిర్మాణం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అన్ని చర్యలు ఫోర్డో కేంద్ర మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి చర్యలుగా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఇప్పటివరకు ఇరాన్ ప్రభుత్వం ఈ అంశంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ముందే ఊహించిన నిపుణుల నివేదిక
ఇరాన్ తరఫున తక్షణ స్పందన ఉండొచ్చని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ (RUSI) గత మార్చిలోనే తన నివేదికలో పేర్కొంది. అమెరికా దాడులకు గురైన తరువాత ఇరాన్ అణు సదుపాయాల పునరుద్ధరణ పనుల్లోకి తక్షణమే దిగుతుందని అంచనా వేసింది. ఫోర్డోలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆ నివేదిక అంచనాలను నిజం చేస్తున్నాయి. గత వారాంతంలో అమెరికా ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ వంటి మూడు ప్రధాన అణు కేంద్రాలపై గగనతల దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అటు వెంటనే ఇరాన్ వేగంగా పునరుద్ధరణ చర్యలు చేపట్టడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

Read More : Trump’s comments – హిరోషిమా, నాగసాకి అణుదాడులతో పోలిక కలకలం