ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు ప్రారంభం

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్రంగా కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో, టెహ్రాన్‌లో నివసిస్తున్న భారతీయుల్ని సురక్షితంగా తరలించేందుకు భారత ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఇప్పటికే మొదటి విడతగా 110 మంది భారతీయులు టెహ్రాన్ నుంచి అర్మేనియాకు క్షేమంగా చేరుకున్నారు. ఈ బృందం జూన్ 18న ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరనుంది.

గతవారం ఇజ్రాయెల్ చేపట్టిన ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ దాడులతో ఈ ఉద్రిక్తతలు ముదిరాయి. ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా మిసైళ్లతో, డ్రోన్లతో ప్రతిఘటనకు దిగింది. ఇప్పటివరకు ఈ ఘర్షణలో ఇజ్రాయెల్‌ నగరాల్లో 20 మంది ప్రాణాలు కోల్పోగా, వందల మంది గాయపడ్డారు. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు తీవ్రమవుతున్నాయి.

భారత ప్రభుత్వం ఈ పరిస్థితిని గమనించి, టెహ్రాన్‌లో నివసిస్తున్న భారతీయులకు వెంటనే నగరం ఖాళీ చేసి రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర సహాయం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది: +989010144557, +989128109115, +989128109109. అంతకుముందే టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా 24 గంటల హెల్ప్‌లైన్ (+972 54-7520711, +972 54-3278392, ఈమెయిల్: cons1.telaviv@mea.gov.in) ద్వారా సహాయ చర్యలు ప్రారంభించింది.

ప్రస్తుతం పరిస్థితిని సమగ్రంగా సమీక్షిస్తూ, భారత ప్రభుత్వం పౌరుల సురక్షతకు అన్ని విధాలుగా చర్యలు చేపడుతోంది.

Read more : హర్యానాలో మోడల్ శీతల్ చౌదరి దారుణ హత్య