పాకిస్థాన్‌పై ఉగ్రవాద ముద్రను గట్టిగా ముద్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 1960లో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఇటీవల రద్దు చేసిన నేపథ్యంలో, పాకిస్థాన్‌కు చుక్క నీరు కూడా వెళ్లకుండా చూడాలని కేంద్రం గట్టి నిర్ణయం తీసుకుంది.
ఈ విషయంపై చర్చించేందుకు శుక్రవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సుమారు 45 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో, పాక్‌కు నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేయడం కోసం తక్షణ, మధ్యకాలిక, దీర్ఘకాలిక చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా అధికారులను పాక్‌కు ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చర్యలు ప్రారంభించాల్సిందిగా కేంద్రం ఆదేశించినట్లు సమాచారం.
సమావేశం అనంతరం జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ మాట్లాడుతూ – “సింధు ఒప్పందాన్ని రద్దు చేయడంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనది. ఇది దేశ ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకున్న గట్టి నిర్ణయం. భవిష్యత్‌లో సింధు నదినుంచి పాక్‌కు నీరు వెళ్లకుండా పూర్తి కట్టడి చేస్తాం,” అని స్పష్టం చేశారు.
ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, బుధవారం భారత్ అధికారికంగా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా, జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ గురువారం పాకిస్థాన్ జలవనరుల శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజాకు లేఖ రాస్తూ, ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ చర్యతో పాటు దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు భారత్ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
Read More : “నీళ్లు ఆపితే శ్వాస ఆపేస్తాం”
