ఇళయరాజా పాటలపై మళ్లీ వివాదం.. మైత్రీకి లీగల్ షాక్!

Ilaiyaraaja copyright issue Good Bad Ugly

సంగీత ప్రపంచంలో లెజెండరీ కంఫోజర్‌గా గుర్తింపు పొందిన ఇళయరాజా మరోసారి కాపీరైట్ వివాదంతో వార్తల్లో నిలిచారు. ఏప్రిల్ 10న విడుదలై విజయవంతంగా దూసుకుపోతున్న “గుడ్ బ్యాడ్ అగ్లీ” చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన కంపోజ్ చేసిన పాత తమిళ పాటలు వినిపించడంతో, అవి తన అనుమతి లేకుండానే ఉపయోగించారని ఆరోపిస్తూ మైత్రీ మూవీ మేకర్స్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ పాటలపై థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చినప్పటికీ, ఇళయరాజా నోటీసులతో ఈ విజయం వివాదాల్లో చిక్కుకుంది.

ఇళయరాజా తరఫున పంపిన నోటీసుల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఐదు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి, సంబంధిత మూడు పాటలను తక్షణమే తొలగించాలి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అనే డిమాండ్లు ఉన్నాయి. ఇది కొత్త పరిణామం కాకపోయినా, ఇళయరాజా ఇంతకు ముందు కూడా అనుమతి లేకుండా తన పాటలు వాడిన సందర్భాల్లో చర్యలు తీసుకున్న నేపథ్యం ఉంది. ప్రముఖ గాయకులు సునిత, ఎస్పీబీ వంటి వారు కూడా గతంలో ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.

ఈ వివాదం నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారా? లేదా ఒరిజినల్ లైసెన్స్‌తోనే పాటలు వాడారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ సంస్థ స్పందించకపోతే, ఈ వివాదం కోర్టుల వరకూ వెళ్లే అవకాశముంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం తమిళ మార్కెట్‌లోకి విస్తరిస్తున్న వేళ, ఇలాంటి వివాదం వారిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక ఈ వివాదానికి ఎలా ముగింపు కలుగుతుందో, మైత్రీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Read More

One thought on “ఇళయరాజా పాటలపై మళ్లీ వివాదం.. మైత్రీకి లీగల్ షాక్!

Comments are closed.