గుంటూరు జిల్లాకు చెందిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిలు వ్యవహారం హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ కుమార్, తల్లి అనారోగ్యంతో ఉన్నట్లు మెడికల్ సర్టిఫికేట్ ఆధారంగా మధ్యంతర బెయిలు పొందిన విషయం తెలిసిందే.
అయితే, అనిల్ కుమార్ సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్ నకిలీ అని పోలీసులు గుర్తించి, దీనిపై విచారణ ప్రారంభించారు. గుంటూరు లలిత ఆసుపత్రికి చెందిన డాక్టర్ పీవీ రాఘవశర్మ సంతకం ఉన్నట్లు సర్టిఫికెట్లో కనిపించడంతో పోలీసులు ఆయనను విచారించారు. విచారణ సందర్భంగా — ఆ సంతకం తనది కాదని, ఆ సర్టిఫికెట్ను తాను జారీ చేయలేదని వైద్యుడు స్పష్టం చేశారు.
ఈ కేసులో నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రాఘవశర్మ ఇచ్చిన వాంగ్మూలాన్ని బోరుగడ్డ అనిల్ కుమార్ తిరస్కరించాడు. దీంతో ఈ విషయంలో స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది.
వైద్యుడి వాంగ్మూలాన్ని జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసి, ఆ నివేదికను హైకోర్టుకు అందించాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా, బెయిలుపై మరింత విచారణ జరిపించాలని అనిల్ కుమార్ తరఫు న్యాయవాది విన్నవించగా, ఆ అభ్యర్థనను న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు తోసిపుచ్చారు.
Read More : భూమన కరుణాకరరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
